Begin typing your search above and press return to search.

ఖాన్ లు..క‌పూర్ ల‌కు కాలం చెల్లిన‌ట్లేనా?

దశాబ్దాలుగా ఖాన్ త్రయం , కపూర్ల వంశం బాలీవుడ్ ని ఏల్తోన్న సంగ‌తి తెలిసిందే. హిందీ సినిమా అంటే వీరే అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది.

By:  Srikanth Kontham   |   25 March 2026 12:02 PM IST
ఖాన్ లు..క‌పూర్ ల‌కు కాలం చెల్లిన‌ట్లేనా?
X

దశాబ్దాలుగా ఖాన్ త్రయం , కపూర్ల వంశం బాలీవుడ్ ని ఏల్తోన్న సంగ‌తి తెలిసిందే. హిందీ సినిమా అంటే వీరే అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది. వీరికి పోటీగా హృతిక్ రోష‌న్ గ‌ట్టిగా నిల‌బ‌డ్డాడు. వాళ్ల వేగాన్ని నియంత్రిం చండంలో హృతిక్ చాలా వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాడు. అనంత‌రం సంచ‌ల‌నం అయినా విక్కీ కౌశ‌ల్ కూడా వీళ్ల నుంచి గ‌ట్టి పోటిని ఎదుర్కుని నిల‌బ‌డ్డాడు. తాజాగా `ధురంధ‌ర్` ప్రాంచైజీతో ర‌ణ‌వీర్ సింగ్ బాలీవుడ్ ముఖ చిత్రాన్నే మార్చ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. దశాబ్ద కాలంలో ఖాన్ల పోటీని తట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఏకైక హీరో హృతిక్ రోషన్.

తన గ్రీక్ గాడ్ లుక్స్, అద్భుతమైన డ్యాన్స్ , నటనతో ఖాన్లకు గట్టి పోటీనిస్తూనే వచ్చారు. హృతిక్ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ స్టార్‌డమ్‌ను శాసించగలిగే సత్తా ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు, ఇప్పుడు రణవీర్ సింగ్ రూపంలో సమాధానం దొరికినట్లు కనిపిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లో `ధురందర్` ఫ్రాంచైజీ ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా `ధురందర్ 2` సాధించిన అసాధారణ విజయం రణవీర్‌ను బాలీవుడ్ తదుపరి సూపర్ స్టార్ సింహాస నంపై కూర్చోబెట్టింది. ఖాన్ల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న తరుణంలో రణవీర్ వరుసగా భారీ వసూళ్లను రాబట్టడం చూస్తుంటే బాలీవుడ్ పగ్గాలు ర‌ణ‌వీర్ చేతుల్లోకి వెళ్లాయని స్పష్టమవుతోంది.

ఆయన ఎనర్జీ, విలక్షణమైన పాత్రల ఎంపిక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రణవీర్ సింగ్‌తో పాటు విక్కీ కౌశల్ కూడా ఖాన్ల పోటీని తట్టుకుని నిలబడటంలో సఫలమయ్యారు. `ఉరి: ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్` సినిమాతో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కేవలం గ్లామర్ మీద కాకుండా కథాబలం ఉన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నారు. స్టార్‌డమ్ కంటే నటనకు పెద్దపీట వేసే విక్కీ కౌశల్ వంటి హీరోలు రాబోయే కాలంలో బాలీవుడ్ పిల్లర్లుగా మారబోతున్నారు అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఖాన్లు , కపూర్ల కాలం పూర్తిగా ముగిసిందని చెప్పలేం కానీ వారి గుత్తాధిపత్యానికి మాత్రం గండి పడింది.

ప్రేక్షకులు కేవలం పేరు చూసి థియేటర్లకు రావడం లేదు. కంటెంట్ బాగుంటేనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్, విక్కీ కౌశల్, విక్రాంత్ మాసే, కార్తీక్ ఆర్య‌న్ వంటి వారు కొత్త తరహా కథలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ `ధురందర్` వంటి మాస్ యాక్షన్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతుండటం గమనార్హం. దీంతో బాలీవుడ్ ఓ పరివర్తన దశలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఖాన్ల యుగం నుండి న్యూ జనరేషన్ స్టార్స్ యుగంలోకి పరిశ్రమ అడుగుపెట్టింది. రణవీర్ సింగ్ తన `ధురందర్` వేగంతో మరిన్ని రికార్డులు సృష్టిస్తే రాబోయే ఐదేళ్లూ ఆయన హవానే నడవడం ఖాయం. సీనియర్ హీరోలు తమ రూటు మార్చుకోకపోతే? ఈ యువ తరం హీరోల ధాటికి వారు తెరమరుగయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది.