సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో నీల్-శ్రీలీల రచ్చ రచ్చ
యష్ తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి బంపర్ హిట్లు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ లాంటి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు.
By: Sivaji Kontham | 27 Oct 2025 9:32 AM ISTయష్ తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి బంపర్ హిట్లు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ లాంటి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్ 2 కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు భువనగౌడ. సలార్ చిత్రానికి అతడే సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు ఎన్టీఆర్- నీల్ కాంబినేషన్ లోని ప్రతిష్ఠాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
నీల్- గౌడ సంబంధం ఈనాటిది కాదు. ఆ ఇద్దరూ చాలా కాలంగా స్నేహితులు. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రంకి కూడా అతడు సినిమాటోగ్రాఫర్. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా సహకారం కొనసాగుతోంది. కాలంతో పాటే ఈ పరుగు. కానీ యువకుడైన భువనగౌడ ఇప్పుడు పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.
ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ నిఖితను భువనగౌడ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి యష్, ప్రశాంత్ నీల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంటను సెలబ్రిటీలు ఆశీర్వదిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భువన్ గౌడ - నికిత వివాహానికి పలు చిత్ర పరిశ్రమల నుండి ప్రముఖులు హాజరయ్యారు. వారిలో తెలుగు నటి శ్రీలీల కూడా ఉంది.
ప్రశాంత్ నీల్, అతడి భార్యతో కలిసి ఎనర్జిటిక్ శ్రీలీల కెమెరాలకు ఫోజులిచ్చిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. శ్రీలీల ట్రెడిషనల్ శారీ లుక్, భారీ ఆభరణాలతో కొత్త లుక్ అదుర్స్... పైగా బ్లాక్ గాగుల్స్ ధరించి ఎంతో స్టైలిష్ గా కనిపించింది. ప్రశాంత్ నీల్ గాగుల్స్ తో అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
