కేజీఎఫ్ భామకు త్రివిక్రమ్ మాటల పరీక్ష
కన్నడ బ్యూటీలు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేయడమంటే ఆషామాషీ విషయం కాదు.
By: M Prashanth | 27 Oct 2026 9:44 PM ISTకన్నడ బ్యూటీలు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేయడమంటే ఆషామాషీ విషయం కాదు. ఆయన రాసే ప్రాసలు, పదునైన పంచ్ డైలాగులు, లోకల్ యాసను పలకడం అనుభవజ్ఞులైన నటీనటులకే పెద్ద పరీక్ష. అలాంటి చోట 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి ఏకంగా తన పాత్రకు తానే సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడం హైలెట్.
'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ వేదికపై శ్రీనిధి మాట్లాడుతూ ఈ డబ్బింగ్ విషయాన్ని బయటపెట్టింది. అమ్మడు కాస్త ఇంగ్లీష్ టచ్ ఇచ్చినా కూడా వేదికపై తెలుగులో ఎక్కువగానే మాట్లాడింది. ఇక డైరెక్షన్ టీమ్ సాయంతో ప్రతి డైలాగ్ దగ్గరా కూర్చుని ఎంతో శ్రమపడి తెలుగు నేర్చుకుని వాయిస్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. నిజానికి 'కేజీఎఫ్' రెండు భాగాల్లోనూ ఆమె క్యారెక్టర్ చాలా సీరియస్ గా, అరకొర డైలాగులతోనే నడిచిపోయింది. లుక్స్ తో నెట్టుకొచ్చిన ఆమెకు, ఆగకుండా డైలాగులు పేలే త్రివిక్రమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఒక పెద్ద సవాల్.
పైగా ఎదురుగా ఉన్నది విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీ టైమింగ్, ఫన్ ఎనర్జీని అందుకోవడం అంత ఈజీ కాదు. ఆయనతో సాగే సరదా సీన్లలో సరైన కౌంటర్లు పడాలన్నా, మాటల్లోని ఎమోషన్ పండాలన్నా వాయిస్ లో డెప్త్ ఉండాలి. వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ పెడితే న్యాచురాలిటీ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే, ఆమెతోనే ఈ ప్రయోగం చేయించారా అనే చర్చ నడుస్తోంది.
శ్రీనిధి కెరీర్ ప్లానింగ్ చూస్తే ఇది చాలా తెలివైన ఎత్తుగడగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ చూసినప్పటికీ, ఆ తర్వాత ఆమెకు సరైన బ్రేక్ దక్కలేదు. తమిళంలో చేసిన సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీపైనే ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే గ్లామర్ షోతో సరిపెట్టకుండా, స్థానిక భాషను ఓన్ చేసుకోవాలనేది ఆమె ఆలోచనలా ఉంది.
అయితే ఇతర భాషల హీరోయిన్లు తెలుగు డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక్కోసారి యాస కుదరక రివర్స్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. తెరపై లిప్ సింక్ మిస్ అయినా, తెలుగు ఉచ్చారణ కాస్త తేడా వచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోతుంది. మరి 'స్వర్ణ' అనే పాత్రకు శ్రీనిధి పలికిన డైలాగులు ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. కేజీఎఫ్ సైలెంట్ ఇమేజ్ ను పక్కనపెట్టి మాటల మాంత్రికుడి ప్రాసలతో రిస్క్ చేసిన శ్రీనిధి.. ఈ డబ్బింగ్ ప్రయోగంతో తెలుగు కుర్రాళ్లను ఫిదా చేస్తుందా లేదో చూడాలి.
