8 కోట్ల రూమర్లు: నోరు విప్పిన కేజీఎఫ్ హీరోయిన్!
తన రెమ్యూనరేషన్ గురించి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఆధారాలు లేని పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
By: Srikanth Kontham | 10 Oct 2026 12:00 AM IST'కేజీయఫ్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక శ్రీనిధి శెట్టి తన పారితోషికం పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఓ కొత్త సినిమా కోసం తాను ఏకంగా 8 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు వస్తున్న రూమర్లను అమ్మడు ఖండించారు. తన రెమ్యూనరేషన్ గురించి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఆధారాలు లేని పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
'అంత పెద్ద మొత్తంలో పారితోషికం నేను ఎలా అడుగుతాను? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పరిధి, బడ్జెట్ , పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రచారంలోకి వచ్చే ఇలాంటి వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రతి సినిమాకు తగిన రీతిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం సహజమే అని, కానీ కనీస సంబంధం లేని భారీ అంకెలను తన పేరుతో ముడిపెట్టడం సరికాదన్నారు.
సినిమా పరిశ్రమలో ఘన విజయం సాధించిన వెంటనే కథానాయికల పారితోషికం ఒక్కసారిగా రెట్టింపైందంటూ ప్రచారాలు జరగడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ల విషయంలో ఇలాంటి రూమర్లు మరింత ఎక్కువగా వినిపిస్తుంటాయి. శ్రీనిధి శెట్టి విషయంలో కూడా 'కేజీయఫ్' రెండు భాగాల భారీ విజయం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ పై రకరకాల వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అమ్మడు 'కేజీయఫ్' తర్వాత తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చిత్రంలో కనిపించారు. అటుపై మరికొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. అయితే కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త వహిస్తున్న కన్నడ భామ ప్రాజెక్టుల సంఖ్య కంటే కూడా బలమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం డబ్బు కోసమే కాకుండా కథలో పాత్ర ప్రాధాన్యత , ప్రాజెక్ట్ విలువను బట్టే సినిమాలకు సైన్ చేస్తున్నట్లు తెలిపారు.
8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఊహాగానాలు రావడం వల్ల పరిశ్రమలో దర్శక, నిర్మాతలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈ విషయంలో బహిరంగంగా స్పష్టత ఇచ్చానన్నారు. ఇలాంటి ప్రచారాలు నటీనటులకు వచ్చే మంచి అవకాశాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. సరైన కథ, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కుదిరినప్పుడు కంటెంట్‌కే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని శ్రీనిధి స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తోన్న `ఆదర్శ కుటుంబం`లో నటిస్తోంది. ఇందులో అమ్మడు వెంకీ భార్య పాత్రలో కనిపించనుంది. అలాగే పిల్లల తల్లిగానూ మెప్పించనుంది. ఈ సినిమా విజయంతో శ్రీనిది కి అవకాశాలు పెరుగుతాయని కాన్పిడెంట్ గా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. త్రివిక్రమ్ నుంచి రిలీజ్ అవుతున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో `మళ్లీశ్వరి` లా హాయిగా సాగిపోతుందని ప్రేక్షకాభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది.
