ఆస్కార్ విజేత మనసులో ఇద్దరు ఇండియన్ లెజెండ్స్!
అయితే ఆ సమయంలో వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ కుదరలేదని, భవిష్యత్తులో సరైన సమయం వస్తే ఖచ్చితంగా షారుక్ పై డాక్యుమెంటరీ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.
By: Srikanth Kontham | 24 Aug 2026 6:00 PM ISTఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ కెవిన్ మాక్‌డొనాల్డ్ ఇటీవల మనసులోని మాటను బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు, సాంస్కృతిక దిగ్గజాల జీవితాలపై డాక్యుమెం టరీలు తెరకెక్కించడంలో పేరుగాంచిన కెవిన్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై డాక్యుమెంటరీ తీయాలని గతంలో ప్రయత్నించినట్లు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం షారుఖ్ ఖాన్‌తో తాను స్వయంగా చర్చలు జరిపినట్లు కెవిన్ మాక్‌డొనాల్డ్ తెలిపారు. భారతదేశంలో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అపారమైన క్రేజ్, కోట్లాది మంది అభిమానులు ఆయన్ని ఎందుకు అంతగా ప్రేమిస్తున్నారు అనే అంశం తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
అయితే ఆ సమయంలో వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ కుదరలేదని, భవిష్యత్తులో సరైన సమయం వస్తే ఖచ్చితంగా షారుక్ పై డాక్యుమెంటరీ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఇదే సందర్భంలో భారతీయ రాజకీయాలు .. ప్రముఖుల వ్యక్తిత్వాలపై తన ఆసక్తిని కెవిన్ పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై కూడా ఒక సినిమా లేదా డాక్యుమెంటరీ తీయాలని ఎంతో ఆసక్తి ఉందని వెల్లడించారు. శక్తివంతమైన రాజకీయ నాయకుడి ముఖచిత్రం వెనుక ఉన్న అసలు మానవుడిని.. సాధారణ ప్రజలకు కనెక్ట్ అయ్యేలా తెరపైకి తీసుకురావడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని కెవిన్ అభిప్రాయపడ్డారు.
అయితే మోడీపై ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం మాత్రం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి రాజకీయ ..చలనచిత్ర ప్రముఖుల వ్యక్తిగత కోణాలను, తెరవెనుక జరిగిన అసలు నిజాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డాక్యుమెంటరీలు ఎంతగానో దోహదపడతాయని నమ్ముతున్నారు. కెవిన్ కెరీర్‌లో ఒప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులపై కూడా డాక్యుమెంటరీలు రూపొందించిన అనుభవం ఆయన సొంతం.
ఇటీవలే కెవిన్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గ్వార్డియోలా జీవితం ఆధారంగా `ఎ బ్యూటిఫుల్ అబ్సెషన్` అనే నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ని తెరకెక్కించి రిలీజ్ చేసారు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కెవిన్ తాను అనుకుంటోన్న ఇండియన్ లెజెండ్స్ పై కూడా డాక్యుమెంటరీలు తీస్తే ప్రేక్షకుల మద్దతు ఉంటుందని తెలుపుతున్నారు.
ఎప్పటికైకా షారుక్ కథను సినిమాగా తెరకెక్కాల్సిందే. అంతకు ముందే డాక్యు రూపంలో రిలీజ్ అయితే? సినిమాగా మరింత వర్కౌట్ అవుతుంది. అలాగే ప్రధాని మోదీకి సెలబ్రిటీలంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పటి వరకూ ఎంతో మంది ప్రధానులు వచ్చారు వెళ్లారు. కానీ మోదీ ఒక్కరే ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీల్ని కలిసిన వ్యక్తిగానూ ఆయన పేరిట రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో మోదీ కథను కెవిన్ తెరకెక్కిస్తానంటే ఎందుకు కాదంటారు.
