Begin typing your search above and press return to search.

కేతిక శ‌ర్మ‌కు బాలీవుడ్‌లోను బిగ్‌ ఢ‌మాల్

ఇక కేతిక శర్మ టాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

By:  Sivaji Kontham   |   11 July 2026 7:00 AM IST
కేతిక శ‌ర్మ‌కు బాలీవుడ్‌లోను బిగ్‌ ఢ‌మాల్
X

ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ టాలీవుడ్‌లో తన గ్లామర్‌తో కుర్రకారును ఆక‌ట్టుకున్నా ఆశించిన స్థాయిలో స్టార్ డ‌మ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భారీ ఆశలతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన `ధమాల్ 4` చిత్రంలో కేతికకు ఒక మంచి అవకాశం దక్కింది. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో ప్ర‌జ‌లు పెద‌వి విరిచేయ‌డం కేతిక‌ను నిరాశ‌ప‌రిచింది.

హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన `ధమాల్ 4` చిత్రానికి యావరేజ్ రివ్యూలు వచ్చాయి. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు కుటుంబ ప్రేక్షకులను అలరించినా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి స్క్రీన్‌ప్లే పూర్తిగా పట్టు కోల్పోయిందని.. సినిమా చాలా ఫ్లాట్‌గా ముగిసిందని విమర్శలు వచ్చాయి. ధమాల్ ఫ్రాంచైజీకి ఉండే అసలైన క్రేజీ.. మ్యాడ్‌నెస్- కామెడీ ఇందులో లోపించిందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే నటించినా.. బలహీనమైన కథనం కారణంగా కేతిక శర్మ పెట్టుకున్న బాలీవుడ్ ఆశలపై ఈ సినిమా నీళ్లు చల్లింది.

ఇక కేతిక శర్మ టాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన బోల్డ్ లుక్స్‌తో మెప్పించిన ఈ భామ ఆ తర్వాత నాగశౌర్య సరసన `లక్ష్య`, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన `రంగ రంగ వైభవంగా`, ఉస్తాద్ రామ్ పోతినేని సరసన `బ్రో` చిత్రంలోనూ మెరిసింది. ఇలా వరుసగా యువ హీరోలతో జతకట్టినా.. ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

వరుస పరాజయాల కారణంగా కేతికకు ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త అవకాశాలు బాగా తగ్గిపోయాయి. టాలీవుడ్ మేకర్స్ ఈ బ్యూటీ వైపు పెద్దగా మొగ్గు చూపకపోవడంతో కేతిక తన రూట్ మార్చక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పొరుగు పరిశ్రమ కోలీవుడ్ (తమిళం) పైనా దృష్టి సారించింది. తెలుగులో బ్రేక్ దక్కకపోయినా.. తమిళ తంబీలను అలరించి అక్కడైనా తన లక్‌ను మార్చుకోవాలని ఈ గ్లామర్ బ్యూటీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

2026-27 సీజన్‌లో కేతిక శర్మ నటించిన చిత్రాలు కొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో హిప్ హాప్ థ‌మిజ‌ సరసన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ `మీసయ్య మురుక్కు 2` లో నటిస్తోంది. దీంతో పాటు `లైలా` అనే మరో తమిళ క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. అలాగే ప్రముఖ దర్శకుడు రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోను ప్రస్తుతం కేతిక షూటింగ్‌లో పాల్గొంటోంది. మునుముందు ఈ వ‌రుస తమిళ చిత్రాలైనా కేతిక శర్మ కెరీర్‌కు బిగ్ బ్రేక్ ఇస్తాయేమో వేచి చూడాలి.