Begin typing your search above and press return to search.

'పెద్ది' హార్డ్‌వ‌ర్క్‌పై నాయ‌కులు కేశినేని- కందుల ప్ర‌శంస‌లు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ`పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   2 Jun 2026 9:48 AM IST
పెద్ది హార్డ్‌వ‌ర్క్‌పై నాయ‌కులు కేశినేని- కందుల ప్ర‌శంస‌లు
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ`పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఊక వేస్తే రాలనంత భారీ జనసందోహం నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు ఆస్కార్ విజేతలు (ఆర్.ఆర్.ఆర్ ఫేం) రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ కలిసి విజయవాడకు రావడం అభిమానులలో సరికొత్త జోష్ నింపింది.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. `పెద్ది` చిత్రాన్ని ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా అభివర్ణించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్స్ సినిమా స్థాయిని చెప్ప‌గ‌ల‌న‌ని.. ఇలాంటి విలక్షణమైన పాత్రలు పోషించాలంటే కఠోర శ్రమ, క్రమశిక్షణ అవసరమని.. రామ్ చరణ్ ఈ సినిమా కోసం అదే స్థాయిలో కష్టపడ్డారని కొనియాడారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, జగపతి బాబు నటన ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చాయని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి - తెలుగు సినిమా ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ...``బెజవాడలో మెగా అభిమానుల సమక్షంలో ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం నెలకొంద``ని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా చరిత్రలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్న ఆయన, మెగాస్టార్ చిరంజీవి `ఇంద్ర` సిల్వర్ జూబ్లీ వేడుకతో పాటు.. పవన్ కళ్యాణ్ `తొలిప్రేమ`, `బద్రి`, `ఖుషి` వంటి చిత్రాలకు విజయవాడ ప్రజలు ఘన విజయాలు అందించారని గుర్తుచేసారు. రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు, బాబాయ్‌కు మించిన అబ్బాయి అని ప్ర‌శంసించారు. చరణ్ నిరంతరం చూపే కష్టం అత‌డిని ఈరోజు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగేలా చేశాయని పేర్కొన్నారు.

ఈ వేడుకలో విజయవాడకు చెందిన నటుడు జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారని అతిథులు అభినందించారు. `పెద్ది` సినిమా ఇప్పటికే సూపర్ హిట్ అయిపోయిందని, విజయవాడ నుంచి ఈ సినిమాకు భారీ కలెక్షన్ల రికార్డులను బహుమతిగా ఇస్తామని.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సంచలనం సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే తాను ఈరోజు మంత్రిగా మీ ముందున్నానని చెబుతూ.. ప్రభుత్వం తరఫున చిత్ర యూనిట్‌కు మంత్రి కందుల‌ దుర్గేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మొత్తానికి `పెద్ది` విజయవాడ వేడుక ఇటు సినిమా పరంగానే కాకుండా... అటు ప్రభుత్వ ప్రతినిధుల మద్దతుతో పరిశ్రమకు ఒక గొప్ప సానుకూల వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి పెద్ద సినిమాలు విజయవంతమైతే వందలాది కుటుంబాలు నిలబడతాయని.. ఈ చిత్రం ఘన విజయం సాధించి మళ్లీ రామ్ చరణ్ విజయవాడకు రావాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ సినిమాతో రామ్ చరణ్ తన తండ్రి - బాబాయ్ వారసత్వాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని అతిథులు ఆశీర్వదించారు.