Begin typing your search above and press return to search.

ఏనుగు దంతాల కేసులో లాల్‌కు కోర్టులో చుక్కెదురు

ఈ కేసును శుక్ర‌వారం నాడు మ‌రోసారి కోర్టు విచారించ‌గా, ఈ విచార‌ణ‌లో మోహన్‌లాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

By:  Sivaji Kontham   |   25 Oct 2025 3:21 PM IST
ఏనుగు దంతాల కేసులో లాల్‌కు కోర్టులో చుక్కెదురు
X

చ‌ట్ట‌విరుద్ధంగా నాలుగు జ‌త‌ల‌ ఏనుగు దంతాల‌ను త‌న ఇంట్లో ఉంచినట్టు గుర్తించిన ఆదాయ‌ప‌న్ను శాఖ 2012లో మాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మోహ‌న్ లాల్ పై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును శుక్ర‌వారం నాడు మ‌రోసారి కోర్టు విచారించ‌గా, ఈ విచార‌ణ‌లో మోహన్‌లాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేరళ హైకోర్టు తాజా విచార‌ణ‌లో.. తన వద్ద ఉన్న ఏనుగు దంతాల వస్తువులకు అటవీ శాఖ యాజమాన్య ధృవీకరణ పత్రాలను స‌మ‌ర్పించినా కానీ, అవి చెల్లనివి, చట్టబద్ధత లేనివి అని ప్రకటించింది. అయితే లాల్ ఈ వ‌స్తువుల‌ను త‌న‌తో ఉంచుకునేందుకు అనుమ‌తిస్తే, చ‌ట్ట ప్ర‌కారం ఒక కొత్త నోటిఫికేష‌న్ జారీ చేయ‌వ‌చ్చ‌ని న్యాయమూర్తులు ఎకె జయశంకరన్ నంబియార్, జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

గతంలో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ముందు రెండు జతల ఏనుగు దంతాలు -13 ఏనుగు దంతాల కళాఖండాల విష‌యంలో సెక్షన్ 42 కింద యాజమాన్య ధృవీకరణ పత్రాలను పొందేందుకు మోహన్‌లాల్‌కు అనుమతినిస్తూ చట్టంలోని సెక్షన్ 40(4) కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ కొచ్చిలోని ఏలూర్‌కు చెందిన పౌలోస్ కెఎ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ తీర్పు వెలువడిందని జాతీయ మీడియా పేర్కొంది. ఏనుగు దంతాల వస్తువులకు సంబంధించిన క్రిమినల్ చర్యలు ఇప్పటికే మెజిస్ట్రేట్ లో పెండింగ్‌లో ఉన్నప్పటికీ అటవీ శాఖ ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేసిందని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది త‌ప్పు జ‌రిగింద‌ని వాదిస్తూనే, లాల్ కు ఉప‌శ‌మ‌నం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసారు.

అడ‌వి జంతువుల వస్తువులు లేదా ట్రోఫీలను చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న వ్యక్తుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విధానాన్ని అమ‌లు చేయాల‌ని కూడా కోర్టు నిర్ధేశించింది. అధికారిక వెబ్ సైట్ లో గెజిట్ ని ప్ర‌క‌టించాల‌ని కూడా సూచించింది. ఈ కేసులో 2015లో అలాగే 2016లో రాష్ట్ర ప్ర‌భుత్వం విడుల చేసిన ఉత్త‌ర్వులు చ‌ట్ట‌బ‌ద్ధం కానివి అని కోర్టు పేర్కొంది. వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 40(4) ప్రకారం చట్టపరమైన విధానాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడానికి స్వేచ్ఛ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

2012లో మోహన్ లాల్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసి 4 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుంది. జూన్ 2012లో, ఆదాయపు పన్ను శాఖ కొచ్చిలోని తేవారా ప్రాంతంలోని లాల్ ఇంటిపై దాడి చేసింది. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న నాలుగు ఏనుగు దంతాలను ఐటీ శాఖ అటవీ శాఖకు అప్పగించింది. ఏనుగు దంతాలను ఉంచడానికి అనుమతి లేని మోహన్ లాల్, వాటిని మరో ఇద్దరు వ్యక్తుల లైసెన్స్ కింద దాచి ఉంచిన‌ట్లు దర్యాప్తు బృందం కనుగొంది. దీనితో కోడనాడ్ రేంజ్ ఫారెస్ట్ కేసు నమోదు చేసింది. ఆ త‌ర్వాత చ‌ట్టాన్ని స‌వ‌రించిన అట‌వీ శాఖ అత‌డికి దంతాల‌ను ఉంచుకునేందుకు అనుమ‌తినిచ్చింది. మోహన్ లాల్‌పై కేసును ఉపసంహరించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో పెరుంబవూర్ కోర్టు తిరస్కరించింది. దీనిపై మోహన్ లాల్ దాఖలు చేసిన అప్పీల్‌లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది.