20 ఏళ్లు జైలు.. కేరళ నటి అత్యాచారం కేసులో సంచలన తీర్పు
ముగింపు విచారణలో నటిపై సామూహిక లైంగిక వేధింపుల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ దర్యాప్తు అధికారి కస్టడీలోనే ఉందని కూడా కోర్టు వెల్లడించింది.
By: Sivaji Kontham | 12 Dec 2025 11:18 PM ISTదాదాపు ఏడేళ్లకు కేరళ నటిపై కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తుది తీర్పును కోర్టు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురికి 20ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షను విధించడంతో పాటు, 5లక్షలు బాధితురాలికి చెల్లించాలంటూ ఎర్నాకుళం జిల్లా - సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించడం చర్చల్లోకి వచ్చింది. 2017లో మొదలైన ఈ కేసు 2025 డిసెంబర్ నాటికి ముగిసింది.
ఈ కేసులో హనీ ఎం వర్గీస్, పల్సర్ సుని (సునీల్ ఎన్ఎస్), మార్టిన్ ఆంటోనీ, మణికందన్ బి, విజేష్ విపి, సలీం హెచ్, ప్రదీప్ లకు 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇతర ఆరోపణలలో శిక్షలు వీరికి అదనం. కానీ అవి ఏకకాలంలో అమలులో ఉంటాయని తీర్పులో జడ్జి సూచించారు.
ముగింపు విచారణలో నటిపై సామూహిక లైంగిక వేధింపుల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ దర్యాప్తు అధికారి కస్టడీలోనే ఉందని కూడా కోర్టు వెల్లడించింది. డిసెంబర్ 8న నటుడు దిలీప్ సహా నలుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన అనంతరం ఈ తుది తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే దోషులకు ఈ శిక్ష సరిపోదని, దోషులు కుటుంబ, ఆరోగ్య సమస్యలను ప్రస్థావిస్తూ ఉపశమనం కోరుతున్నారని కూడా న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసులో దోషులుగా తేలిన మార్టిన్, ప్రదీప్ .. తమపై కుటుంబం ఆధారపడి ఉందని వివరించే ప్రయత్నం చేసారు. కానీ కోర్టు దానికి స్పందించలేదు.
అలాగే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి అజా కుమార్, సామూహిక అత్యాచారానికి ఇంకా పెద్ద శిక్ష విధించాలని వాదించారు. పల్సర్ సుని చేసిన నేరం ఇతర నిందితుల కంటే తీవ్రమైనదని వాదించింది. అయితే తప్పు విధానం, తీవ్రత దృష్ట్యా కాకుండా, అందరికీ ఒకే శిక్షను విధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. నేరస్తులపై ఇంకా కఠినమైన శిక్ష కోసం అప్పీల్ చేయమని ప్రభుత్వానికి సలహా ఇస్తానని అజాకుమార్ చెప్పారు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, 17 ఫిబ్రవరి 2017న నిందితులు నటి ప్రయాణిస్తున్న కారులోకి బలవంతంగా ప్రవేశించి రెండు గంటల పాటు వేధింపులకు గురి చేసారు. పల్సర్ సుని ఆమెపై లైంగిక దాడి చేసి, ఇతరుల సహాయంతో దానిని రికార్డ్ చేశాడు. ఈ నేరంలో కుట్ర పన్నినట్లు మొదట ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్‌ను అరెస్టు చేశారు. కానీ దాదాపు ఆరు సంవత్సరాల పాటు జరిగిన విచారణ తర్వాత చివరికి నిర్దోషిగా విడుదల చేశారు.
