Begin typing your search above and press return to search.

షేక్స్‌పియర్ నాటకాల నుంచి రష్యన్ ఫైట్ల వ‌ర‌కూ!

హాలీవుడ్ నటుడు, దిగ్గజ దర్శకుడు కేనెత్ బ్రానాగ్ (65) సరికొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

By:  Srikanth Kontham   |   23 Sept 2026 9:00 PM IST
షేక్స్‌పియర్ నాటకాల నుంచి రష్యన్ ఫైట్ల వ‌ర‌కూ!
X

హాలీవుడ్ నటుడు, దిగ్గజ దర్శకుడు కేనెత్ బ్రానాగ్ (65) సరికొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు షేక్స్‌పియర్ నాటకాల ఆధారంగా తెరకెక్కిన బరువైన పాత్రలతో మెప్పించిన కేనెత్ ఈసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంతో పాటు శారీరక ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికే తాజా చిత్రంలో యాక్షన్ పాత్రను అంగీకరించినట్లు వెల్లడించారు.

యాపిల్ టీవీ నిర్మాణంలో కోల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న `మేడే` చిత్రంలో కేనెత్ బ్రానాగ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో ఆయన నికోలాయ్ ఉస్టినోవ్ అనే మాజీ కేజీబీ ఏజెంట్‌గా కని పిస్తారు. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ భూభాగంలో ప్రమాదానికి గురైన ఓ అమెరికన్ పైలట్‌కు సహాయం చేసే క్రమంలో శత్రువులతో కేవలం ఒక పెన్నుతో కూడా పోరాడేంత నైపుణ్యం కలిగిన పోరాట యోధుడిగా ఆయన పాత్ర సాగుతుంది.

ఈ చిత్రంలోని కఠినమైన యాక్షన్ సీన్ల కోసం 65 ఏళ్ల వయసులో కేనెత్ ఎంతో శ్రమించారు. ఫైట్ కొరియోగ్రఫీని సమర్థవంతంగా నేర్చుకోవడానికి గంటల తరబడి యోగా సాధన చేయడంతో పాటు క్రమశిక్షణతో కూడిన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పరుగెత్తడం, దూక‌డం, ఫైటింగ్ సన్నివేశాల్లో గాయాలు కాకుండా ఇతరులకు హాని కలగకుండా జాగ్రత్త పడుతూనే ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి సినిమా తనకు మంచి అవకాశంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఇలాంటి విలక్షణమైన రష్యన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అవకాశం దక్కిందని తెలిపారు. జోనాథన్ గోల్డ్‌స్టెయిన్, జాన్ ఫ్రాన్సిస్ లే రాసిన స్క్రిప్ట్ ఎంతో నచ్చిందని, స్పష్టమైన విజన్ ఉన్న దర్శక ద్వయంతో పని చేయడం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ చిత్రంలో అమెరికన్ నేవీ పైలట్ ట్రాయ్ కెల్లీగా ప్రముఖ నటుడు రైన్ రేనాల్డ్స్ నటించారు. కేనెత్ బ్రానాగ్, రైన్ రేనాల్డ్స్ మధ్య కుదిరిన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

కాస్ట్యూమ్ టెస్ట్ సమయంలో మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచే వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ప్రమోషన్స్ సమయంలో ఎక్కువగా ఫుట్‌బాల్ గురించి ముచ్చటించుకుంటామని కేనెత్ తెలిపారు. అలాగే అమెరికన్ సంస్కృతి పట్ల `టాప్ గన్' సినిమా పట్ల ప్రత్యేక ఆరాధన ఉన్న రష్యన్ ఏజెంట్‌గా కేనెత్ పాత్ర అలరించనుంది. అమెరికన్లు, రష్యన్ల పట్ల సాధారణంగా ఉండే పాత మూస భావనలను సరికొత్త కామెడీ కోణంలో ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రమిది.