Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఇద్దరు మాఫియా 'అక్క'లు ఎదురెదురు పడితే?

ఈ సిరీస్ కథాంశం ఎంతో విభిన్నంగా.. దాదాపు 800 ఏళ్లుగా పూర్తిగా మహిళల పాల‌న‌లో ఉన్న‌ ఒక కల్పిత రాజ్యం నేపథ్యంలో సాగుతుంది.

By:  Sivaji Kontham   |   22 Oct 2026 10:50 PM IST
ట్రైలర్ టాక్: ఇద్దరు మాఫియా అక్కలు ఎదురెదురు పడితే?
X

ఇన్నాళ్లు తెరపై మగ మాఫియా కథలు, రౌడీయిజం చూసి విసిగిపోయిన ప్రేక్షకుల కళ్ల ముందుకు యష్ రాజ్ ఫిలింస్ ఒక సరికొత్త మ‌హిళా మాఫియా ప్రపంచాన్ని తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 30న విడుదల కాబోతున్న క్రైమ్ డ్రామా సిరీస్ `అక్క` టీజర్ - ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఇద్దరు శక్తివంతమైన మహిళలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్న తీరు ఆద్యంతం రక్తి కట్టిస్తోంది.

ఈ సిరీస్ కథాంశం ఎంతో విభిన్నంగా.. దాదాపు 800 ఏళ్లుగా పూర్తిగా మహిళల పాల‌న‌లో ఉన్న‌ ఒక కల్పిత రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. 1985 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథ `పెర్నూరు` అనే కల్పిత పట్టణంలో నడుస్తుంది. ఇక్కడ వ్యాపారాలు, గృహాలు, క్రిమినల్ నెట్‌వర్క్‌లన్నీ పూర్తిగా మహిళల నియంత్రణలోనే ఉంటాయి. ఈ సమాజంలో అత్యున్నత పదవిలో ఉన్న మాతృస్వామ్య అధిపతికి `అక్క` అనే బిరుదు ఇవ్వడం ఈ రాజ్య ప్రత్యేకత.

అయితే ఈ సామ్రాజ్యానికి సొంత గడ్డపై నుంచే ఒక పెద్ద ముప్పు ఎదురవుతుంది. వ్యవస్థను, అధికారిక హోదాను ధిక్కరిస్తూ సామ్రాజ్యాన్ని కూల్చేందుకు రుద్ర (రాధికా ఆప్టే) రంగంలోకి దిగుతుంది. మరోవైపు తన కుటుంబం శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న వారసత్వాన్ని, పెర్నూరుపై ఉన్న పట్టును ఏమాత్రం కోల్పోవడానికి సిద్ధంగా లేని భవానీ (కీర్తి సురేష్) రుద్ర‌ను ఎదుర్కొంటుంది. భవానీ వర్సెస్ రుద్ర మధ్య సాగే ఈ పోరు ట్రైలర్‌లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

ఈ సిరీస్‌లో భవానీ అక్క పాత్రలో మహానటి కీర్తి సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా.. గంభీరంగా జీవించగా, ఆమెకు ధీటుగా రుద్ర పాత్రలో రాధికా ఆప్టే తన రంజైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆప్టే ఈ చిత్రంలో కాస్త ఘాటైన, ఇంటెన్స్ సన్నివేశాల్లో నటించడం మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. కేవలం మాటలతో కాకుండా ఆయుధాలు, హింసాత్మక ఘర్షణలతో ఈ పోరు సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో తన్వి అజ్మి, మహేష్ మంజ్రేకర్‌, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ వంటి ప్రముఖ తారాగణం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇద్దరు మాఫియా `అక్క`లు ఎదురుపడితే ఆ రాజ్యంలో ఎలాంటి తుఫాను చెల‌రేగింది? చివరికి ఎవరు గెలిచారనే పూర్తి వివరాలు అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో తేలనున్నాయి.