8 గంటల పనిదినం వెనక కష్టం చెప్పిన కీర్తి
వాస్తవానికి 9కి మేకప్ తో ఆర్టిస్టు రెడీ అవ్వాలంటే 7గంటలకే సెట్లో ఉండాలి. ఆర్టిస్టు 6 గంటలకు బయల్దేరితేనే సెట్ కి రాగలడు.
By: Sivaji Kontham | 27 Nov 2025 9:46 AM ISTఈరోజుల్లో 8గంటల పనిదినం గురించి దేశవ్యాప్తంగా అన్ని సినీపరిశ్రమల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. దీపిక పదుకొనే కేవలం 8గం.ల పని దినం కారణంగా రెండు పెద్ద అవకాశాల్ని కోల్పోవడంతో ఈ చర్చకు మరికాస్త ప్రాధాన్యత పెరిగింది. అయితే ఎనిమిది గంటల పనిదినం లేదా 9-6 జాబ్ గురించి నటి కీర్తి సురేష్ ని ప్రశ్నిస్తే, తను ఇచ్చిన జవాబు నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి తాను 24గంటల షిఫ్ట్ పని చేస్తానని కీర్తి సురేష్ అన్నారు. 9-6 షిప్ట్... 9-9 షిఫ్ట్.. 9-2 షిఫ్ట్ కూడా తనకు అలవాటు అని తెలిపారు. నిజానికి నేను `మహానటి` షూటింగ్ చేసేప్పుడు ఒకేసారి ఐదు సినిమాలకు పని చేసాను. అజ్ఞాతవాసి, సామి 2, సర్కార్, పందెంకోడి 2 (సందకోడి2) , వీటితో పాటు మహానటి సినిమా చేసాను.
చాలామందికి ఎనిమిది గంటల పని దినం అంటే అర్థం కావడం లేదు. దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వాస్తవానికి 9కి మేకప్ తో ఆర్టిస్టు రెడీ అవ్వాలంటే 7గంటలకే సెట్లో ఉండాలి. ఆర్టిస్టు 6 గంటలకు బయల్దేరితేనే సెట్ కి రాగలడు. అలా రావాలంటే, 5 గంటలకు నిద్ర లేచి రెడీ అవ్వాలి. 6 గంటలకు ప్యాకప్ చెబితే, మేకప్ రిమూవ్ చేసి ప్రయాణించి ఇంటికి వెళ్లడానికి అదనంగా మరో గంట పడుతుంది. 9-6 పని అంటే ఇంత ఉంటుంది.. అని కీర్తి డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది కేవలం ఆర్టిస్టు వరకే, టెక్నీషియన్లు, లైట్ మెన్లు వీరంతా ఆర్టిస్టులు సెట్ కి రాకముందే అక్కడ ఉండాలి. ఆర్టిస్టులు వెళ్లిపోయిన తర్వాత సెటప్ మొత్తం సర్ధుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంటే వాళ్లు ఎంత అదనపు సమయం పని చేయాలో, ఎంతగా వేచి చూడాలో ఆలోచించండి! అని కీర్తి సురేష్ సినిమా కష్టాల గురించి మాట్లాడారు.
`మహానటి` చిత్రీకరణ సమయంలో మరో నాలుగు సినిమాలతో తాను 24 బై 7 కాల్షీట్లను మ్యానేజ్ చేసానని తెలిపారు. సహజంగా మనిషికి 8గంటల నిద్ర అవసరం. కానీ మాకు అంత నిద్ర ఎక్కడ కుదురుతుంది. 5గంటలు నిదురపోవడం కూడా గగనం. సాయంత్రం 8గం.లకు ఇంటికి చేరితే ఆ తర్వాత ఒక గంట వర్కవుట్ల కోసం, అర్థగంట షవర్ కింద సరిపోతుంది.11- 11.30 పీఎం మధ్య నిదురపోతే మళ్లీ 5గంటలకే నిద్ర లేవాలి అని ఆర్టిస్టు రోజువారీ సైకిల్ గురించి కీర్తి వర్ణించిన తీరు నిజంగా కళాకారుల కష్టానికి అద్దం పట్టింది. తెలుగు తమిళంలో 9-6 పని చేస్తారు కానీ, మలయాళం, హిందీలో 12గంటలు వర్క్ షెడ్యూల్ ఉంటుందని కూడా కీర్తి వెల్లడించారు. `రివాల్వర్ రీటా` విడుదల ప్రచారంలో బిజీగా ఉన్న కీర్తి ఈ విషయాలన్నిటినీ చెప్పారు. కీర్తి నటించిన రివాల్వర్ రీటా ఈనెల 28న విడుదల కానుంది.
