Begin typing your search above and press return to search.

న‌టి కాక‌పోయి ఉంటే డిజైన‌ర్ అయ్యేదానిని: కీర్తి సురేష్‌

న‌టి మేన‌క కుమార్తె కీర్తి సురేష్. స‌హ‌జంగానే ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కీర్తి న‌టిగా ఈజీగా ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యిపోయింది.

By:  Sivaji Kontham   |   13 Sept 2025 9:22 AM IST
న‌టి కాక‌పోయి ఉంటే డిజైన‌ర్ అయ్యేదానిని: కీర్తి సురేష్‌
X

న‌టి మేన‌క కుమార్తె కీర్తి సురేష్. స‌హ‌జంగానే ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కీర్తి న‌టిగా ఈజీగా ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యిపోయింది. త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళ‌ భాష‌ల్లో పెద్ద స్టార్ అయింది. కెరీర్ ఆరంభ‌మే మ‌హాన‌టి లాంటి బ‌యోపిక్ చిత్రంలో లెజెండ‌రీ సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే, అగ్ర హీరోల సినిమాల్లోను అవ‌కాశం అందుకుంది.

చూస్తుండ‌గానే ద‌శాబ్ధం కెరీర్ ర‌న్ పూర్తి చేసింది. ప‌న్నెండేళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో క‌థానాయిక‌గా రాణించ‌డం అంటే అంత సులువు కాదు. క‌థానాయిక‌ల‌కు మైలేజ్ త‌క్కువ‌. కానీ కీర్తి ఉత్త‌మ పెర్ఫామ‌ర్ గా నిరూపించుకుంటూ కెరీర్ ని ముందుకు న‌డిపిస్తోంది. తాజాగా ఎల్లే డిజిట‌ల్ క‌వ‌ర్ పేజీపై ముఖ‌చిత్రంగా క‌నిపించింది ఈ బ్యూటీ.

`ఎల్లే డిజిట‌ల్` ఇంట‌ర్వ్యూలో కీర్తి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రివీల్ చేసింది. ఒకవేళ త‌ను న‌టి అవ్వ‌క‌పోతే క‌నీసం స్టైలిష్ట్ లేదా మోడ‌ల్ గా కొన‌సాగేది. ప్రారంభం న‌టి అవ్వాల‌ని ఇక్క‌డికి రాలేదు. మోడ‌ల్ లేదా స్టైలిష్టుగా రాణించాల‌ని అనుకుంది. కానీ అనూహ్యంగా త‌న త‌ల్లి మేన‌క‌ బాట‌లోనే కీర్తి న‌టి అయింది. పెద్ద స్థాయికి ఎదిగింది. కీర్తి ప్ర‌యోగాత్మ‌క‌త‌ను ఎల్లే మ్యాగ‌జైన్ కీర్తించింది. త‌న త‌ల్లిదండ్రుల నుంచి క‌ళ అబ్బింద‌ని కూడా త‌న క‌థ‌నంలో పేర్కొంది. సినీరంగంలో అడుగుపెట్టే ముందు స్ట‌డీస్ పూర్తి చేయాల‌ని త‌ల్లిదండ్రులు పట్టుబట్టారు. దానికి కీర్తి సురేష్ అంగీకరించారు.

నటనలో ప్రయత్నించే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని నాన్నగారు అడిగినా నాకు ప్లాన్ బి ఉంద‌ని కీర్తి చెప్పింది. నేను స్టైలిస్ట్ లేదా మోడల్‌గా పనిచేయడానికి సిద్ధ‌మయ్యాను... చివరికి నటనారంగంలోకి ప్ర‌వేశించేందుకు ఫ్యాషన్ డిజైనింగ్ చదివాను! అని గుర్తుచేసుకుంది.