మా నాన్న కంటే ఎక్కువ ప్రయారిటీ మీకే ఇచ్చా - కీర్తి సురేష్
కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
By: Madhu Reddy | 13 Oct 2025 1:48 PM ISTకీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో నేను శైలజా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. 'మహానటి' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన పాత్రలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్న కీర్తి సురేష్.. తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసింది..
ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. తన తండ్రి కంటే ఎక్కువ ప్రయారిటీ మీకే ఇచ్చాను అంటూ జగపతిబాబుతో చెప్పడమే కాకుండా ఆయనకు క్షమాపణలు కూడా తెలియజేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా తన ప్రేమ గురించి చెబుతూ.." నేను ఆంథోనీ తట్టిల్ తో ప్రేమలో పడ్డాను. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. 15 సంవత్సరాలు ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాము. ఆరేళ్లు తను ఖతార్ లో ఉన్నాడు. నేను ఇండియాలో ఉన్నాను. అక్కడి నుంచి వచ్చాక ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాము. అయితే నాలుగేళ్ల క్రితమే మేము మా ఇంట్లో చెప్పడం జరిగింది. మా ప్రేమ గురించి చెప్పగానే మా నాన్న వెంటనే అంగీకరించారు. అయితే మా ఇంట్లో మా నాన్నకు చెప్పడం కంటే ముందే నా ప్రేమ గురించి మీకు చెప్పాను" అంటూ కీర్తి సురేష్ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే తన ప్రేమ విషయాన్ని చెప్పడంలో తన తండ్రి కంటే జగపతిబాబుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది కీర్తి సురేష్ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో జగపతిబాబుకి క్షమాపణలు కూడా చెప్పింది కీర్తి సురేష్. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే నా ప్రేమ గురించి తెలుసు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరు అంటూ జగపతిబాబుతో చెప్పిన కీర్తి సురేష్ మాట్లాడుతూ.." పెళ్లి అయ్యేవరకు నా ప్రేమ గురించి ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. అందుకే చాలా తక్కువ మందికి మాత్రమే చెప్పాను. ఇక నేను బాగా నమ్మిన వ్యక్తులలో మీరు కూడా ఒకరు కాబట్టే నా వ్యక్తిగత విషయాలను మీతో పంచుకున్నాను. కానీ పెళ్లికి పిలవలేకపోయాను.. నన్ను క్షమించండి" అంటూ కీర్తి సురేష్ తెలిపింది. ప్రస్తుతానికి కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆయన సినిమాలు వస్తే కాలేజ్ డుమ్మా కొట్టి మరీ సినిమా చూడడానికి వెళ్ళిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
