కృతి శెట్టి అలా.. కీర్తి సురేష్ ఇలా.. అదృష్టం ఎవరివైపు?
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇతర భాషలపై ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 18 Jan 2026 6:00 PM ISTఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇతర భాషలపై ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే అలా అడుగుపెట్టిన వారికి ఆ సినీ పరిశ్రమ ఘన స్వాగతం పలికినా.. ఒక్కొక్కసారి ఆ సినిమాల ఫలితాలు వారికి పూర్తిస్థాయిలో నిరాశను మిగులుస్తూ ఉంటాయి. ఉదాహరణకు భారీ అంచనాల మధ్య సరైన సక్సెస్ అందుకోవడానికి యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇటీవల కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.
సుధా కొంగర దర్శకత్వంలో 1969లో జరిగిన హిందీ వ్యతిరేకత నిరసనలను ఆధారంగా చేసుకొని 'పరాశక్తి' సినిమాను తెరకెక్కించారు. శివ కార్తికేయన్ హీరోగా నటించారు. ఎన్నో ఆశలతో ఈ సినిమాతో తొలి కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది శ్రీ లీల. అయితే అక్కడ ఈమెకు ఎదురుదెబ్బే మిగిలింది. ఈ సినిమాను కొంతమంది బాగుంది అని చెప్పినా చాలా వరకు ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. పైగా బ్యాన్ చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. దాంతో అమ్మడికి నిరాశ తప్పలేదు అని చెప్పాలి. ఇక ఈ సినిమా నిరాశ మిగిల్చినా.. మరొకవైపు హీరో ప్రదీప్ రంగనాథన్ ఏజిఎస్ నిర్మాణంలో నటించి, దర్శకత్వం వహిస్తున్న ఒక కొత్త సినిమాలో అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ఈమెకు కోలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తెలుపుతట్టే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా మరొకవైపు శ్రీ లీలాతో పాటు తెలుగులో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కృతిశెట్టి. ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందినవారే. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకున్న ఈమె.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో తన అదృష్టాన్ని పక్క భాషలో పరీక్షించుకోవాలనుకుంది. అందులో భాగంగానే కార్తీతో 'వా వాతియర్' అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ కూడా విడుదలకు నోచుకోలేదు. దీంతో ప్రదీప్ రంగనాథన్ తో ' LIK ' (లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ కావడంతో ఈమెకు అదృష్టం కలిసి రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే మరోవైపు గత కొద్ది రోజులుగా ఈమె బాలీవుడ్ లో సినిమా చేస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు గతంలో కృతి శెట్టి ముంబైలో కనిపించడంతో.. బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని అందుకే ఆమె అక్కడే ఆడిషన్ కి హాజరవుతోంది అని కూడా వార్తలు వచ్చాయి. దీంతో కోలీవుడ్ లో ఎలాగో ఆమె సినిమాలు విడుదలకు నోచుకోలేదు.. కనీసం బాలీవుడ్ లోనైనా ఆమెకు అదృష్టం కలిసి వస్తుందని అందరూ భావించారు. అయితే చివరికి కృతి శెట్టికి బదులుగా ఆ ప్రాజెక్టులోకి కీర్తి సురేష్ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈమె బేబీ జాన్ సినిమాతో హిందీలో అడుగుపెట్టినా.. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కనీసం ఈ సినిమా అయినా ఈమెకు కలిసి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా కృతి శెట్టి అలా.. కీర్తి సురేష్ ఇలా.. మరి ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో చూడాలి.
