Begin typing your search above and press return to search.

పవన్‌ మాస్‌, మహేష్ చైల్డ్‌, నాని కైండ్‌....!

మళ్లీ ఇప్పుడు విడుదలకు ముందు చిత్ర యూనిట్‌ సభ్యులు హడావిడి చేశారు. ప్రమోషన్‌ ఈవెంట్స్‌తో హడావిడి చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

By:  Ramesh Palla   |   27 Nov 2025 12:02 PM IST
పవన్‌ మాస్‌, మహేష్ చైల్డ్‌, నాని కైండ్‌....!
X

కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా రూపొందిన రివాల్వర్ రీటా రేపు విడుదల కాబోతుంది. జె కె చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌లో కీర్తి సురేష్ పాత్ర విభిన్నంగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఫస్ట్‌ లుక్‌ను సమంత చేతుల మీదుగా విడుదల చేయించిన కారణంగా ఆ సమయంలో సినిమా గురించి చర్చ జరిగింది. అసలు ఈ టైటిల్‌కి కీర్తి సురేష్ సెట్‌ అవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. కానీ సినిమా ఆలస్యం కావడంతో కాస్త వేడి తగ్గినట్లు అయింది. మళ్లీ ఇప్పుడు విడుదలకు ముందు చిత్ర యూనిట్‌ సభ్యులు హడావిడి చేశారు. ప్రమోషన్‌ ఈవెంట్స్‌తో హడావిడి చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి కీర్తి సురేష్‌

తమిళ్‌లో రూపొందిన రివాల్వర్‌ రీటా సినిమాను తెలుగులో అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు రావడంలో భాగంగా ప్రమోషన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ సమయంలో కీర్తి సురేష్‌ తాను వర్క్ చేసిన తెలుగు హీరోల గురించి స్పందించింది. యాంకర్‌ ఒక్క మాటలో హీరోల నుంచి మీరు ఏమి దొంగిలించాలి అనుకుంటున్నారు అంటూ కీర్తి సురేష్ కొందరి పేర్లను సూచించింది. అప్పుడు కీర్తి సురేష్ చాలా ఆసక్తికరంగా సమాధానాలు చెప్పింది. చాలా స్పీడ్‌గా ఆ సమాధానాలు చెప్పినా, వాటిని కాస్త లోతుగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. మొత్తానికి కీర్తి సురేష్ తన హీరోలకు చాలా క్యూట్‌గా వారి గురించిన ట్యాగ్‌ లైన్స్‌ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించి, వైరల్‌ అవుతోంది.

మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ల గురించి...

రామ్‌ పోతినేని నుంచి ఎనర్జీని దొంగిలించాలని అనుకుంటున్నట్లుగా కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇంకా నాని నుంచి దయా గుణం, మహేష్‌ బాబు నుంచి పిల్లల మనస్థత్వం, పవన్ కళ్యాణ్‌ నుంచి మాస్‌ ను దొంగిలించాలని అనుకుంటున్నట్లుగా కీర్తి సురేష్ చాలా స్పీడ్‌గా చెప్పింది. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి అంటే హీరోయిన్స్ కాస్త భయపడుతారు. ఎవరి గురించి ఏమి చెబితే విమర్శలు వస్తాయో అనుకుంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం తాను నటించిన ఆ స్టార్స్‌ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను అంటూ చెప్పకనే చెబుతూ, వారి నుంచి ఆ మంచి గుణాలను దొంగిలించాలి అనుకుంటున్నట్లుగా చెప్పడం ద్వారా కీర్తి సురేష్ మరో మెట్టు ఎక్కింది అంటూ ఆమె అభిమానులతో పాటు మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్‌ సినిమాలో

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి దిల్‌ రాజు బ్యానర్‌ లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే ఏడాదిలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దిల్ రాజు మరియు శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

'రాజా వారు రాణి గారు', 'అశోక వనంలో అర్జున కళ్యాణం' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు మేకర్స్ ఇటీవల జరిగిన పూజా కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లో కాస్త గ్యాప్‌ తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.