Begin typing your search above and press return to search.

ఒక్క మాటతో రూమర్స్‌కు చెక్..

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాపై ప్రారంభమైన ఓ ప్రచారం ఇప్పుడు అధికారికంగా ముగిసినట్లే కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 July 2026 11:55 PM IST
ఒక్క మాటతో రూమర్స్‌కు చెక్..
X

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాపై ప్రారంభమైన ఓ ప్రచారం ఇప్పుడు అధికారికంగా ముగిసినట్లే కనిపిస్తోంది. పూజా కార్యక్రమంతో ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇది మలయాళ హిట్ మూవీ గురువాయూరంబల నడయిల్ రీమేక్ అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఊహాగానాలకు హీరోయిన్ కీర్తి సురేష్ నేరుగా చెక్ పెట్టింది. ఈ సినిమా రీమేక్ కాదంటూ చెప్పిన మాట‌తో ఆ సందేహాలకు తెరపడింది.

ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెంకటేష్‌కు జోడీగా కనిపించనుండగా, కృతి శెట్టి కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, జీ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది.

అయితే ఈ రీమేక్ ప్రచారం ఎందుకు మొదలైందనే ప్రశ్నకు కూడా ఆసక్తికరమైన సమాధానమే కనిపిస్తోంది. సినిమా పూజా కార్యక్రమంలో రిలీజైన‌ గ్రూప్ ఫొటోను గురువాయూరంబల నడయిల్ పోస్టర్‌తో పోలుస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, అలాగే మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ అనే అంశం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. కానీ మేక‌ర్స్ మాత్రం ఇది పూర్తిగా కొత్త కథతో రూపొందుతున్న ఒరిజినల్ సినిమా అని స్పష్టం చేస్తున్నారు.

గతంలో తెలుగు సినీ పరిశ్రమలో రీమేక్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఇతర భాషల కథల ఆధారంగానే తెరకెక్కాయి. అప్పట్లో ప్రాంతీయ భాషల సినిమాలు అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు వెంటనే అందుబాటులో ఉండేవి కావు. అందుకే మంచి కథలను స్థానిక నేటివిటీకి అనుగుణంగా మార్చి వాటిని మళ్లీ తెరకెక్కించడ‌మ‌నేది స‌క్సెస్‌ఫుల్ స్ట్రాట‌జీగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ తో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలు రిలీజైన కొద్ది రోజుల్లోనే తెలుగు ప్రేక్షకుల చేతికి చేరుతున్నాయి. సబ్‌టైటిల్స్ సౌకర్యం వల్ల భాష కూడా పెద్ద అడ్డంకిగా లేకపోవడంతో, ఇప్పటికే చూసిన కథను మళ్లీ రీమేక్ రూపంలో చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియ‌న్స్ లో తగ్గిపోయింది. అందుకే రీసెంట్ గా రిలీజైన పలు రీమేక్ సినిమాలు ఆశించిన స‌క్సెస్ ను అందుకోలేకపోయాయి.

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమా విషయంలో రీమేక్ అనే ముద్ర పడకుండా చిత్రబృందం మొదట్లోనే క్లారిటీ ఇవ్వడం కూడా ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్‌లో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు ఆడియ‌న్స్ కు దగ్గరగా ఉండే పాత్రలతో కథను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అఫీషియ‌ల్ టైటిల్, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.