'వారణాసి' ఆల్బమ్: 'నాటు నాటు'ను మించి ఇంకేదైనా ఇస్తారని ఆశ!
ఆయన సుదీర్ఘమైన నిబద్ధతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభించినా కానీ.. నేటి విపరీతమైన పోటీ వాతావరణంలో ఆ పాత విజయాలు మాత్రమే సరిపోవు.
By: Sivaji Kontham | 19 Aug 2026 9:00 PM ISTఒక సంగీత దర్శకుడికి అంతర్జాతీయ వేదికపై అత్యున్నత పురస్కారమైన `ఆస్కార్` లభించిన తర్వాత అతడి తదుపరి ప్రాజెక్టుపై శ్రోతలలో ఏ స్థాయి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలోని `నాటు నాటు..` పాటకు గాను ఆస్కార్‌ను ముద్దాడిన స్వరమాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి (మరకతమణి) విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. బాహుబలి, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ వంటి దృశ్య కావ్యాలకు అంతర్జాతీయ స్థాయి పాటలు.. అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించడానికి కీరవాణి ఎంతో శ్రమించారు. ఆయన సుదీర్ఘమైన నిబద్ధతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభించినా కానీ.. నేటి విపరీతమైన పోటీ వాతావరణంలో ఆ పాత విజయాలు మాత్రమే సరిపోవు.
ప్రస్తుత సినిమా ప్రపంచంలో సరిహద్దులు చెరిగిపోయాయి. క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కెమెరూన్, రూసో బ్రదర్స్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు తమ సంగీత దర్శకుల నుంచి ఎలాంటి అత్యున్నత ప్రమాణాలతో కూడిన అవుట్‌పుట్ తీసుకుంటారో.. నేడు టాలీవుడ్, కోలీవుడ్‌లోని నవతరం దర్శకులు కూడా అదే స్థాయిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్ల పరిమితులను దాటి, హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా క్వాలిటీ మ్యూజిక్.. క్రియేటివ్ ట్యూన్స్ కోసం నేటి జెన్-జీ దర్శకనిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త శబ్ద తరంగాలను సృష్టించడమే ఇప్పుడు కీరవాణి ముందున్న అతిపెద్ద సవాలు.
మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కీరవాణికి పోటీ బయటి నుంచి మాత్రమే కాక స్వయంగా ఆయన ఇంట్లోని వారసుడు కాలభైరవ నుంచి కూడా ఎదురవుతోంది. కాలభైరవ తన అద్భుతమైన సంగీత మాయాజాలంతో ఆధునిక ధ్వనులతో తన స్థాయిని పెంచుకుంటూ నేటితరం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో, తన సుదీర్ఘ అనుభవానికి నేటి అధునాతన సౌండ్ టెక్నాలజీని జోడిస్తే కీరవాణి సంగీతంలో మరో అంతర్జాతీయ స్థాయిని ఆవిష్కరించగలరనే దృఢమైన నమ్మకం అందరిలోనూ ఉంది. అందుకే ఆయన నుంచి రానున్న `వారణాసి` ట్యూన్స్, బీజీఎం హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గవని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి భారీ అంచనాల నడుమ కీరవాణి ఇటీవల `వారణాసి` ఆల్బమ్‌పై ఒక బిగ్ క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటరాక్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారణాసి ఆల్బమ్ ఎంతో గ్రాండియర్‌గా ఉండబోతోందని స్పష్టమైన హామీ ఇచ్చిన ఆయన ఈ ఆల్బమ్‌లో మొత్తం 6 పాటలు ఉంటాయని ఖరారు చేశారు. ఆస్కార్ విజేత నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటన అభిమానుల్లోను, సంగీత ప్రియుల్లోనూ సినిమాపై ఉన్న ఆసక్తిని ఒక్కసారిగా రెట్టింపు చేసింది.
వారణాసి ఆల్బమ్ నుంచి ఇప్పటికే విడుదలైన `రణ కుంభ`, `సంచారి` అనే రెండు పాటలు సంచలన విజయాన్ని సాధించి.. చార్ట్‌బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కీరవాణి ఇచ్చిన క్లారిటీ ప్రకారం ఆల్బమ్‌లో మరో నాలుగు పాటలు మాత్రమే బాకీ ఉన్నాయి. హాలీవుడ్ ప్రమాణాలను తలపించేలా ఆ మిగిలిన నాలుగు పాటలను, నేపథ్య సంగీతాన్ని కీరవాణి ఎలా తీర్చిదిద్దారో ఆ సంగీత సునామీ ఎప్పుడు రాబోతోందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
