కీరవాణి.. ఇంకా ఏం చేస్తున్నట్లు..
2027 ఏప్రిల్ 7న రిలీజ్ పెట్టుకున్న సినిమాకు జనవరికల్లా తన మ్యూజిక్ వర్క్ పూర్తి చేయాలన్నది ఆయన లెక్క. అంటే పాటలు ఒకవైపు, ఐదు నెలల స్కోర్ మరోవైపు అన్నమాట.
By: M Prashanth | 4 Sept 2026 9:21 AM IST‘వారణాసి’ కోసం కీరవాణి ఈసారి చాలా ముందుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనిలోకి దిగుతున్నారు. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని ఇప్పటికే చెప్పారు. సెప్టెంబర్ నుంచి స్కోర్ మొదలుపెట్టి జనవరి వరకు దాదాపు ఐదు నెలలు అదే పనికి టైమ్ పెట్టబోతున్నట్టు వెల్లడించారు. 2027 ఏప్రిల్ 7న రిలీజ్ పెట్టుకున్న సినిమాకు జనవరికల్లా తన మ్యూజిక్ వర్క్ పూర్తి చేయాలన్నది ఆయన లెక్క. అంటే పాటలు ఒకవైపు, ఐదు నెలల స్కోర్ మరోవైపు అన్నమాట.
కీరవాణి దగ్గర ‘వారణాసి’ ఒక్కటే లేదు. చిరంజీవి ‘విశ్వంభర’కు పాటలు ఆయనవే. అయితే ఆ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను గౌర హరి చేస్తున్నట్టు టాక్ వచ్చింది. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు మాత్రం సినిమాలోనే ఉంటాయి. దీంతో ‘విశ్వంభర’ బీజీఎం కోసం ఆయన విడిగా టైమ్ పెట్టాల్సిన పని లేకుండా పోయింది. ‘వారణాసి’కి ఐదు నెలలు కేటాయిస్తున్న సమయంలో ఈ చేంజ్ కూడా ఆయన క్యాలెండర్‌కు కాస్త స్పేస్ ఇచ్చినట్టే.
ఇంకో వైపు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’కు కూడా కీరవాణినే సంగీత దర్శకుడిగా తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. ‘హను మాన్’కు కొనసాగింపుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. 2027 రిలీజ్ టార్గెట్‌తో పని జరుగుతోంది. ఇటీవల కొత్త క్యాస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ‘వారణాసి’ తర్వాత కీరవాణి దగ్గర ఎక్కువ టైమ్ తీసుకునే సినిమా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది.
అలాగే ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ ప్రాజెక్ట్‌కు కూడా కీరవాణే సంగీతం అందిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత జరిగే కథతో ఇషాన్ శుక్లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఇందులో మొదటి భాగాన్ని 2027లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా యానిమేషన్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే మరో అప్డేట్ రానుంది.
‘వారణాసి’ దగ్గర మాత్రం టైమ్ లెక్క చాలా క్లియర్‌గా ఉంది. రాజమౌళి చెప్పిన దాని ప్రకారం పెద్ద యాక్షన్ సీక్వెన్సుల షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇప్పుడు చిన్న కనెక్టింగ్ సీన్లు చేస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షూటింగ్ ముగించాలన్న ప్లాన్ ఉంది. అదే సమయంలో కీరవాణి స్కోర్ మొదలవుతుంది. షూటింగ్ ఒకవైపు ముగుస్తుంటే, మ్యూజిక్ పని మరోవైపు జనవరి వరకు సాగుతుంది.
ఒక సంగీత దర్శకుడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉండటం కొత్త కాదు. కానీ ఒకే సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఐదు నెలలు ముందే లాక్ చేసుకోవడం మాత్రం వేరే లెక్క. జనవరి తర్వాత ‘జై హనుమాన్’ ఆల్బమ్ ముందుకొస్తుందా, లేక ‘బాహుబలి’ యానిమేషన్ మ్యూజిక్ నుంచి ఏదైనా వినిపిస్తుందా అన్నది చూడాలి.
