స్పెషల్ సాంగ్స్.. చిత్ర యూనిట్ కి వాటితో పని లేదా?
సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ తీసుకున్న ఈ దారి ఇప్పుడు వారికే ఇబ్బందిగా మారింది. ఆ వివరాలు చూద్దాం..
By: Madhu Reddy | 17 March 2026 12:50 PM ISTభారతీయ సినిమాలో బాలీవుడ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని చెబుతుంటారు. కానీ, కమర్షియల్ సినిమాల పేరుతో వస్తున్న కొన్ని పాటలు మాత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. తాజాగా 'KD: ది డెవిల్' సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నోరా ఫతేహి డాన్స్ చేసిన ఈ పాటలోని లిరిక్స్ అత్యంత అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ తీసుకున్న ఈ దారి ఇప్పుడు వారికే ఇబ్బందిగా మారింది. ఆ వివరాలు చూద్దాం..
వివాదాస్పద సాహిత్యం - నెటిజన్ల ఆగ్రహం:
ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కెడి: ది డెవిల్'. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో నోరా ఫతేహి తన డాన్స్‌తో ఆకట్టుకున్నప్పటికీ, రకీబ్ ఆలం అందించిన సాహిత్యం మాత్రం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా ఆ పాటలోని కొన్ని లైన్లు వింటుంటే అవి డబుల్ మీనింగ్ కంటే ఎక్కువగా, పచ్చి బూతులా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పాట క్లిప్పింగ్స్ వైరల్ అవుతుండటంతో, ఇలాంటి పాటలు సమాజంపై, ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంక్షోభంలో నిర్మాణ సంస్థ?:
ఈ సినిమాను నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా, యశ్ 'టాక్సిక్' వంటి భారీ ప్రాజెక్టులు ఈ బ్యానర్ నుంచే రాబోతున్నాయి. అయితే, ఈ సంస్థ నిర్మిస్తున్న ‘జన నాయకుడు’ విడుదల ఆలస్యం కావడం, వడ్డీల భారం పెరగడం వంటి సమస్యలు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో 'కెడి: ది డెవిల్' సినిమాపై భారీ ఆశలు పెట్టుకోగా, విడుదలైన మొదటి పాటే వివాదంలో చిక్కుకోవడం నిర్మాతలకు మింగుడు పడటం లేదు. ఇక వివాదం వల్ల పబ్లిసిటీ వస్తుందని భావించినా, అది నెగటివ్ టాక్‌గా మారడం గమనార్హం.
ప్రమోషన్ వ్యూహం బెడిసికొట్టిందా?:
ఇక సాధారణంగా సినిమాల్లో ఐటెం సాంగ్స్ లేదా స్పెషల్ సాంగ్స్ పెట్టేది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే. కానీ ఈ సినిమా విషయంలో ఆ ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. రకీబ్ ఆలం రాసిన లిరిక్స్ లో ఎక్కువగాడబుల్ మీనింగ్స్ ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రమోషన్ కోసం గ్లామర్ మరియు వివాదాస్పద సాహిత్యాన్ని నమ్ముకున్న చిత్ర యూనిట్‌కు నెటిజన్ల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఇలాంటి వివాదాలు దెబ్బతీసే అవకాశం ఉంది.
కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జాకు ఈ సినిమా విజయం ఎంతో అవసరం. ఆయన గత చిత్రం ‘మార్టిన్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో, ఆ ప్రభావం ఈ సినిమా బిజినెస్‌పై పడే అవకాశం ఉందని బెంగళూరు సినీ వర్గాలు భావిస్తున్నాయి. మూడు సంవత్సరాలుగా శ్రమించి తీసిన ఈ యాక్షన్ డ్రామాను వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఐటెం సాంగ్ వివాదం సినిమాపై ఒక రకమైన నెగటివ్ ముద్ర వేస్తోంది. సంజయ్ దత్ లాంటి దిగ్గజ నటుడు ఉన్న ఈ సినిమాలో, కేవలం అశ్లీలతనే నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా అనేది ఒక కళ, అది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకే పాటల విషయంలో కూడా చిత్ర యూనిట్ బాధ్యతగా వ్యవహరించాలి. ఇక కేవలం వివాదాలతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని చూడటం సరైన పద్ధతి కాదు. ‘KD: ది డెవిల్’ చిత్ర యూనిట్ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మంచి కథ, కథనంతో కాకుండా ఇలాంటి వివాదాస్పద పాటలతో పాన్ ఇండియా మార్కెట్‌ను ఆకర్షించడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
