పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్ డిలేకు కారణం?
ఈ విడుదల జాప్యంపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు సునీల్ నారంగ్ స్పందిస్తూ.. తెలుగు వెర్షన్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు.
By: Sivaji Kontham | 1 May 2026 7:00 AM ISTధృవ సర్జా కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందిన `కేడీ: ది డెవిల్` చిత్రం నేడు (ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చింది. అయితే ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సిన ఈ సినిమా.. కేవలం మాతృభాష అయిన కన్నడలో మాత్రమే విడుదలై మిగిలిన భాషల ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ వెర్షన్లు నేడు విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో జరిగిన జాప్యమేనని తెలుస్తోంది. చివరి నిమిషం వరకు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో.. ఇతర భాషల డబ్బింగ్ కాపీలను సిద్ధం చేసి థియేటర్లకు పంపడం నిర్మాతలకు సాధ్యపడలేదు.
ఈ విడుదల జాప్యంపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు సునీల్ నారంగ్ స్పందిస్తూ.. తెలుగు వెర్షన్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మే 7వ తేదీని టార్గెట్‌గా పెట్టుకుని ఇతర భాషల విడుదల కోసం శ్రమిస్తోందని ఆయన వెల్లడించారు.
దీనిపై నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సెన్సార్ అడ్డంకులు.. సాంకేతిక కారణాల వల్ల పాన్ ఇండియా స్థాయిలో రావాల్సిన సినిమా ఇలా ఒక్క భాషకే పరిమితం అవ్వాల్సొచ్చిందని తెలిపారు. వేగంగా అన్ని భాషల రిలీజ్ కి లైన్ క్లియర్ చేస్తామని మే 7న రిలీజ్ చేస్తామని తెలిపారు.
`కేడీ: ది డెవిల్` కథాంశం విషయానికి వస్తే.. ఇది 1970వ దశకంలో బెంగళూరులో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా. అండర్ వరల్డ్ డాన్ కాళీ (ధృవ సర్జా) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రక్తపాతం, పగ, ప్రతీకారాలతో కూడిన అప్పటి బెంగళూరు మాఫియా సామ్రాజ్యాన్ని దర్శకుడు ప్రేమ్ కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. యుద్ధం గెలవాలంటే తెలివితేటలు మాత్రమే కాదు... కొంచెం `డెవిల్` మనస్తత్వం కూడా ఉండాలనే కోణంలో ఈ కథ సాగుతుంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి స్టార్ల రాకతో కథలో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఈ సినిమాపై కన్నడ సమీక్షకులు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేసినా కానీ.. నటుడిగా ధృవ సర్జా ఈ చిత్రంలో ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారని కన్నడ ప్రేక్షకులు చెబుతున్నారు. కాళీ పాత్ర కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను.. ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో అతడు చూపిన తీక్షణత.. డైలాగ్ డెలివరీ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ .. ఇంటర్వెల్ బ్లాక్స్‌లో ధృవ సర్జా నటన ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని సమాచారం. తన కెరీర్‌లోనే ఇది అత్యంత కష్టపడి చేసిన సినిమా అని ఆయన ఇదివరకే పేర్కొన్నారు.
సినిమా మేకింగ్ వాల్యూస్, విజువల్స్ .. ధృవ సర్జా యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌కు కన్నడ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాతృభాషలో మంచి స్పందన రావడంతో మే 7న విడుదల కానున్న ఇతర భాషా వెర్షన్లపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఇతర భాషల్లో కూడా `కేడీ` ఇదే రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో లేదో వేచి చూడాలి.
