సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!
సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి నటీనటుల విలాసవంతమైన డిమాండ్లే ప్రధాన కారణమని నిర్మాత, దర్శకుడు కేసీ బొకాడియా అన్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలు తమ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులను నిర్మాతలపై వేయలేదని గుర్తుచేశారు. నేటి నటులు నాలుగు నుంచి పది వ్యానిటీ వ్యాన్లు కోరుతున్నారని, ఈ ధోరణి మారకపోతే పరిశ్రమ సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు.
By: Srikanth Kontham | 5 Nov 2026 11:00 PM ISTప్రస్తుత పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడానికి ప్రధాన కారణం నటీనటుల ఖరీదైన హంగులు, అదనపు సిబ్బంది ఖర్చులేనని ప్రముఖ నిర్మాత-దర్శకుడు కేసీ బొకాడియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల గొప్పదనాన్ని ప్రశంసించారు. వీరంతా తమ వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలను ఎప్పుడూ నిర్మాతల నెత్తిన రుద్దలేదని తెలిపారు.
ఈ అగ్ర హీరోలు తమతో పాటు పనిచేసే సిబ్బందికి అయ్యే ఖర్చులను స్వయంగా భరించారే తప్ప చిన్న చిన్న ఖర్చులకు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని బొకాడియా గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అపారమైన ఫాలోయింగ్ ఉన్న ఈ దిగ్గజాలు చూపిన స్థాయి .. సంయమనాన్ని ప్రస్తుత తరం నటీనటులు కూడా అలవర్చుకోవాలని హితవు పలికారు. అగ్ర హీరోలుగా ఉన్నవారే నిరాడంబరంగా ఉంటే మిగతా నటులు కూడా అదే ఒరవడిని అనుస రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే నేటితరం నటులు షూటింగ్ లొకేషన్లలో ప్రదర్శిస్తున్న డిమాండ్లు ఆందోళనకరంగా మారాయని కేసీ బొకాడియా తెలిపారు. ఒకే వ్యానీటి వాన్ కాకుండా జిమ్ సదుపాయాలు ఉండేవి సహా ఏకంగా నాలుగు నుంచి పది వ్యానీటి వాన్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిత్ర యూనిట్ లోని చిన్న సిబ్బంది నుంచి మేనేజర్ల వరకు రోజువారీ పారితోషికాలు లక్షల్లోకి చేరాయని.. ఇది నిర్మాతలకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతోందన్నారు.
గతకాలపు అనుభవాలను గుర్తుచేసుకుంటూ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ లాంటి వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎంత సులువుగా సర్దుకుపోయేవారో? వివరించారు. ఒక్కోసారి లగ్జరీ సూట్ రూమ్ దొరకకపోయినా? ఎలాంటి ఫిర్యాదు చేయకుండా సింపుల్ డబుల్ రూమ్‌లోనే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. విలాసాల కోసం నిర్మాతల బడ్జెట్‌ను విపరీతంగా పెంచేస్తున్నారని విమర్శించారు.
నిర్మాతలు బతికితేనే పరిశ్రమ, నటులు బతుకుతారనే విషయాన్ని అందరూ గ్రహించాలని బొకాడియా పిలుపునిచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే సినిమాల నిర్మాణం భారమై భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. నటీనటులు నిర్మాతల కష్టాన్ని గుర్తించి భారీ వ్యయాల విషయంలో కొంత దయ చూపాలని విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమలో పేరు మోసిన సూపర్ స్టార్ల నిరాడంబరతను గుర్తుచేస్తూ బొకాడియా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటీనటుల అధిక డిమాండ్లు..పెరుగుతున్న ప్రొడక్షన్ ఖర్చులపై జరుగుతున్న చర్చకు ఈ సంఘటన మరింత బలాన్నిచ్చింది.
