బుల్లితెరపై ఉపాధి వేదన: కేబీసీ వేదికగా ఓ మధ్యతరగతి కుటుంబం కన్నీటి విన్నపం!
ప్రసిద్ధ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (కేబీసీ) వేదిక కేవలం నాలెడ్జ్ పోటీలకే పరిమితం కాలేదు.
By: Srikanth Kontham | 30 Aug 2026 1:34 PM ISTప్రసిద్ధ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (కేబీసీ) వేదిక కేవలం నాలెడ్జ్ పోటీలకే పరిమితం కాలేదు. సమాజంలోని సజీవ దృశ్యాలకు అద్దం పడుతోంది. ఇటీవల హాట్ సీట్‌పైకి వచ్చిన విశాల్ ప్రేమ్‌చంద్ రాథోడ్ అనే పోటీదారుడి కుటుంబ ఉపాధి పోరాటం ప్రేక్షకుల హృదయాలను కలచివేసింది. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకు చెందిన విశాల్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవాలనే ఆశతో గేమ్ షోలో అడుగుపెట్టాడు. కార్యక్రమం సందర్భంగా విశాల్ తల్లిదండ్రులు అనుకోకుండా వ్యక్తపరిచిన ఆవేదన దేశంలో నెలకొన్న నిరుద్యోగ తీవ్రతను ప్రత్యక్షంగా కళ్లకట్టింది.
స్టూడియోలో ఉన్న ఆడియన్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన వారు తమ కుమారుడికి ఏదో ఒక చిన్న ఉద్యోగం (ఛోటీ సీ నౌకరీ) ఇచ్చి ఆదుకోవాలని కన్నీటితో అభ్యర్థించారు. టీవీ షోలో నగదు బహుమతి గెలవడం కంటే స్థిరమైన ఉద్యోగం లభిస్తే తమ జీవితానికి భరోసా దక్కుతుందని తల్లిదండ్రులు భావించడమే ఈ పరిస్థితికి కారణం.
ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న నేటి యువత నిరాశకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
డిగ్రీలు, అర్హతలు ఉన్నా? ఉద్యోగ వేటలో ఎదురవుతోన్న అడ్డంకులు, కుటుంబాల ఆర్థిక భారాన్ని పెంచు తున్నాయి. నేషనల్ టెలివిజన్ వేదికపై ఒక తండ్రి, తల్లి తమ బిడ్డ భవిష్యత్తు కోసం పబ్లిక్‌గా విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి రావడం దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఈ ఎపిసోడ్ ప్రసారమైన వెంటనే సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సమక్షంలో జరిగిన ఈ కన్నీటి సన్నివేశం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసింది.
నెటిజన్లు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. `ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు. నేటి భారతీయ యువత ఎదుర్కొంటున్న వాస్తవిక నిరుద్యోగ స్వరూపం` అని కామెంట్లు పెడుతున్నారు. గేమ్ షోలలో పెద్ద మొత్తంలో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉన్నా? సాధారణ కుటుంబాలు ఇప్పటికీ రోజువారీ జీవనానికి సాధారణ ఉద్యోగాన్నే ప్రాథమిక రక్షణగా భావిస్తాయని ఈ ఉదంతం వెల్లడిస్తోంది.
క్విజ్ షోల ద్వారా వచ్చే తాత్కాలిక ఆర్థిక ఊరట కంటే? శాశ్వతమైన ఉద్యోగ భద్రతే కుటుంబాలకు అసలైన ధైర్యాన్ని ఇస్తుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. మొత్తానికి వినోద వేదికగా భావించే బుల్లితెర ప్రోగ్రామ్‌లు కూడా దేశంలోని సామాజిక-ఆర్థిక సవాళ్లను ప్రతిబింబించే ఐకాన్ గా మారుతున్నాయి. యువతకు తగిన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గట్టిగా గుర్తు చేస్తోంది.
