Begin typing your search above and press return to search.

ఐఐటీ బొంబాయి టాపర్‌ను ఇబ్బంది పెట్టిన కోటి రూపాయల ప్రశ్న!

ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) సీజన్ 18 ఎపిసోడ్ ప్ర‌స్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 10:37 PM IST
ఐఐటీ బొంబాయి టాపర్‌ను ఇబ్బంది పెట్టిన  కోటి రూపాయల ప్రశ్న!
X

ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` (KBC) సీజన్ 18 ఎపిసోడ్ ప్ర‌స్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల ఐఐటీ బొంబాయి టాపర్, యూపీఎస్సీ అభ్యర్థి అయిన యోగేష్ సాహు హాట్ సీట్‌పై కూర్చుని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. అయితే కోటి రూపాయల కీలకమైన ప్రశ్న వరకు చేరుకున్న యేగేష్‌కు ఆ ప్ర‌శ్న‌కు సరైన సమాచారం లేకపోవడంతో రిస్క్ చేయకుండా వెనుకంజ వేసి 50 లక్షలు గెలుచుకున్నారు.

యోగేష్ సాహు ప్రతిభతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన ఎదుర్కొన్న కోటి రూపాయల ప్రశ్న అందరినీ ఆశ్చ‌ర్యప‌రిచింది. `1943లో ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరిగిన మొదటి ఇండియన్‌ డెర్బీని బరోడా మహారాజాకు చెందిన ఏ గుర్రం గెలుచుకుంది? అనే ప్రశ్న ఆయన ఎదుట నిలిచింది. దీనికి `ప్రిన్సెస్ బ్యూటిఫుల్`, `రీగల్ డొమైన్`, `స్టార్ ఆఫ్ గ్వాలియర్`, `ప్రిన్స్ ప్రదీప్` అనే నాలుగు ఆప్షన్లు ఇవ్వబడ్డాయి.

ఆ సమయానికి యోగేష్ వద్ద ఎలాంటి లైఫ్‌లైన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి సమాధానం ఊహించడానికి ప్రయత్నించారు. ప్రశ్నలో `గుర్రం` అని మాత్రమే ఉందని ఒకవేళ అది ఆడ గుర్రం అయితే ప్రశ్నను మరోలా అడిగి ఉండేవారని భావించారు. ఈ తార్కిక ఆలోచనతో సరైన సమాధానమైన `ప్రిన్సెస్ బ్యూటిఫుల్` అనే ఆప్షన్‌ను ఆయన తొలగించి చివరకు `ప్రిన్స్ ప్రదీప్` అని సమాధానం ఊహించి ఆటను క్విట్ చేశారు.

ఆట ముగిసిన తర్వాత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అసలు సమాధానం `ప్రిన్సెస్ బ్యూటిఫుల్` అని వెల్లడించారు. అది ఆడ గుర్రం కాబట్టే దాని పేరులో ప్రిన్సెస్ అని ఉందని అమితాబ్ వివరించారు. ప్రశ్న రూపకల్పన సరిగ్గా లేదని తాను భావించడం వల్లే సరైన సమాధానాన్ని తొలగించాల్సి వచ్చిందని యోగేష్ నవ్వుతూ పేర్కొన్నారు.

యోగేష్ సాహు కోటి రూపాయల ప్రశ్న గురించిన చర్చ‌కే పరిమితం కాలేదు. ఆయన వ్యక్తిగత నేపథ్యం కూడా అందరినీ కదిలించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సంవత్సరానికి 18 లక్షల వేతనం వచ్చే ఉద్యోగం వచ్చినా? తన ఐఏఎస్ కల కోసం ఆయన దానిని వదులుకున్నారు. నెలకు 20,000 సంపాదించే తన తండ్రి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తన చదువుకు ఇస్తున్న మద్దతును యేగేష్ షోలో భావోద్వేగంతో పంచుకున్నారు.

చివరకు కోటి రూపాయల ప్రశ్న వద్ద ఆటను విర‌మించుకున్నా? యోగేష్ సాహు సాధించిన 50 లక్షల బహుమతి ఆయన కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. అత్యున్నత విద్యను అభ్యసించిన ప్రతిభావంతులు కూడా కొన్నిసార్లు క్లిష్టమైన చరిత్ర ఆధారిత ప్రశ్నల వద్ద తికమక పడతారనడానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది.