పేదింటి బిడ్డకు కోటి రూపాయల జాక్‌పాట్!
మహారాష్ట్రకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు భూషణ్ ఠాక్రే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’లో కోటి రూపాయలు గెలిచి ఈ సీజన్ తొలి కోటీశ్వరుడిగా నిలిచాడు. తల్లి నగలు తిరిగి కొనివ్వడం, ఆమె వైద్య ఖర్చులు భరించడం తన తొలి లక్ష్యమని చెప్పాడు. పదేళ్ల కలను నిజం చేసుకున్న భూషణ్.. సివిల్స్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించాడు.
By: Madhu Reddy | 24 Nov 2026 2:01 PM ISTకష్టపడే తత్వం, పట్టుదల ఉంటే పేదరికం ఎప్పటికీ అడ్డుకాదని మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన భూషణ్ ఠాక్రే నిరూపించాడు. ఒక సాధారణ రోజువారీ కూలీ కొడుకు, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’లో కోటి రూపాయలు గెలుచుకుని ఈ సీజన్ తొలి కోటీశ్వరుడిగా నిలిచాడు. 2016 నుంచి పదేళ్లుగా కన్న కలను నిజం చేసుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచిన భూషణ్ సక్సెస్ వెనుక ఎన్నో కన్నీళ్లు, మరెన్నో అవమానాలు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ జర్నీ ఏంటో చూద్దాం..
పదేళ్ల పట్టుదల.. యూపీఎస్సీ కల:
భూషణ్ ఈ స్థాయికి రావడానికి వెనుక పదేళ్ల కష్టం ఉంది. 2016 నుంచి కేబీసీ హాట్ సీట్లో కూర్చోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు విఫలమైనా అస్సలు వెనక్కి తగ్గలేదు. కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితం ఇంటిని వదిలి భుసావల్‌కు వెళ్లి, అక్కడ ఉంటూ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆ చదువులో నేర్చుకున్న జనరల్ నాలెడ్జ్ ఇవాళ అతడిని కోటీశ్వరుడిని చేసింది.
తల్లి నగలు తిరిగి కొనివ్వడమే మొదటి లక్ష్యం:
కోటి రూపాయలు గెలిచాక ఆ డబ్బుతో ఏం చేస్తావని అడిగితే భూషణ్ చెప్పిన మాట అందరి మనసును కదిలించింది. తన చదువు కోసం అమ్మిన తల్లి బంగారు నగలను తిరిగి కొనివ్వాలని, అలాగే అనారోగ్యంతో ఉన్న తల్లి వైద్య ఖర్చులు భరించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఇక మిగిలిన డబ్బును భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతూనే, మంచి కోచింగ్ తీసుకుని సివిల్స్ సాధించాలనేదే తన అసలైన లక్ష్యమని చెప్పాడు.
డబ్బు రాగానే మారిపోయిన బంధువుల తీరు:
మన దగ్గర డబ్బు లేనప్పుడు ఒకలా, డబ్బు రాగానే మరోలా ప్రవర్తించే మనుషుల గురించి భూషణ్ చెప్పిన విషయాలు ఆలోచింపజేస్తాయి. గతంలో తల్లి వైద్యం కోసం వెయ్యి రూపాయలు సాయం అడిగితే ఫోన్లు కూడా ఎత్తని బంధువులు, ఇప్పుడు కోటి రూపాయలు గెలవగానే ఫోన్లు చేసి అభినందనలు చెబుతున్నారట. ఇక సమాజంలో మనిషి విలువను డబ్బు ఎలా మారుస్తుందో భూషణ్ అనుభవం కళ్లకు కట్టింది.
ఇది కేవలం గెలుపు కాదు.. ఒక స్ఫూర్తి:
ఇంటి నుంచి కేబీసీ సెట్‌కు వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు కూడా లేని స్థితి నుంచి, షో నిర్వాహకుల సాయంతో వెళ్లి ఏకంగా కోటి రూపాయలు గెలవడం మామూలు విషయం కాదు. ఇక ఏడు కోట్ల ప్రశ్న దగ్గర ఆగినా, భూషణ్ సాధించిన ఈ విజయం ఎంతోమంది పేద విద్యార్థులకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. త్వరలోనే అతడు సివిల్స్ కూడా సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం.
