ఆత్మగౌరవం వర్సెస్ గ్లామర్: పరిశ్రమలో మహిళల ఆవేదనపై నోరు విప్పిన కయాదు లోహర్!
చిత్ర పరిశ్రమలో గ్లామర్ పేరిట మహిళలను వస్తువుగా పరిగణించే సంస్కృతిపై ఎదురుతిరగడం ఎంతటి కష్టమైన విషయమో? నటి కయాదు లోహర్ వివరించే ప్రయత్నం చేసారు.
By: Srikanth Kontham | 6 Sept 2026 8:46 AM ISTచిత్ర పరిశ్రమలో గ్లామర్ పేరిట మహిళలను వస్తువుగా పరిగణించే సంస్కృతిపై ఎదురుతిరగడం ఎంతటి కష్టమైన విషయమో? నటి కయాదు లోహర్ వివరించే ప్రయత్నం చేసారు. `ఇమ్మోర్టల్ పెద్ది`చిత్రంలో నటించిన అమ్మడు పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే మానసిక ఘర్షణలను - సెట్స్‌పై తమ స్వరాన్ని వినిపించేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను వివరించారు. సినిమాలో మహిళల పాత్రలను డిజైన్ చేసే తీరుపై కయాదు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో మహిళలను ఓ వస్తువుగా చిత్రీకరించే అంశాలపై నిరసన తెలపడం ఏ నటికైనా కష్టమైన పనిగా అభిప్రా యపడ్డారు.
షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్ సరికాదని భావించినప్పుడు `నో` చెప్పడం ధైర్యంతో కూడుకున్న విషయం. అయితే పరిశ్రమలో ఉండే ఒత్తిళ్ల వల్ల చాలామంది నటీమణులు అభిప్రాయాలను బయటకు చెప్పలేక మౌనంగా ఉండిపోతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నటిగా పాత్రకు ఇచ్చే ప్రాధాన్యత మాత్రమే ముఖ్యమని, కేవలం ప్రదర్శన వస్తువుగా చూపించే సన్నివేశాలకు ప్రాధాన్యత ఇవ్వనని కయాదు స్పష్టం చేశారు. స్క్రిప్ట్ .. షూటింగ్ దశలో అసౌకర్యంగా అనిపించే విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల ఎదురయ్యే పరిణామాలను తట్టుకోవడం అంత సులభం కాదన్నారు.
కానీ నటిగా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం తప్పదని కయాదు పేర్కొన్నారు. నటీనటుల భావప్రకటనా స్వేచ్ఛ ..గౌరవానికి సెట్స్‌లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. దర్శకు, నిర్మాతలు గ్లామర్ కోసమే కాకుండా కథలో మహిళా పాత్రలకు బలమైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. `ఇమ్మోర్టల్ పెద్ది` సినిమాలో పనిచేస్తున్నప్పుడు కథానాయిక పాత్రను డిజైన్ చేసిన విధానం .. పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించారు.
పరిశ్రమలో మారుతున్న కాలంతో పాటు మహిళల పాత్రలలో కూడా మార్పులు రావాలని కయాదు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్లో కూడా విజ్ఞత పెరిగిందని కేవలం గ్లామర్ ఆధారంగా వచ్చే సినిమాల కంటే నటనకు, కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కథానాయికలు కూడా తమ పరిధులను దాటి పాత్రల ఎంపికలో ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మొత్తంగా చలనచిత్ర రంగానికి వచ్చే యువ నటీమణులకు కయాదు మంచి సందేశాన్ని ఇచ్చారు. అసౌకర్యంగా లేదా తప్పుగా అనిపించిన ఏ విషయానికైనా సెట్స్‌లో ధైర్యంగా నో చెప్పే అలవాటు చేసుకోవాలని సూచించారు. నటీమణులు హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం గళం విప్పినప్పుడే పరిశ్రమలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని కయాదు లోహర్ వ్యాఖ్యలతో అద్దం పడుతోంది.
