Begin typing your search above and press return to search.

కాయదు తాగిన బాటిల్.. మూడు లక్షలా?

హీరోయిన్ల గ్లామర్‌కు అభిమానులు ఫిదా అవ్వడం మామూలే. కానీ ఆ అభిమానం మరీ ఈ రేంజ్‌కు వెళ్తుందా అనిపించే వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   21 Oct 2026 2:52 PM IST
కాయదు తాగిన బాటిల్.. మూడు లక్షలా?
X

హీరోయిన్ల గ్లామర్‌కు అభిమానులు ఫిదా అవ్వడం మామూలే. కానీ ఆ అభిమానం మరీ ఈ రేంజ్‌కు వెళ్తుందా అనిపించే వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ కాయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్‌ను ఏకంగా రూ.3 లక్షలకు అమ్మకానికి పెట్టారట. అదీ ఓఎల్ఎక్స్‌లో అనే ప్రచారం మొదలైంది. పది ఇరవై రూపాయల బాటిల్‌కు మూడు లక్షల ధర ఏంటంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కాయదు వాటర్ బాటిల్‌తో కనిపించారు. ఆ ఫొటో ఆధారంగానే ఈ మూడు లక్షల వ్యవహారం బయటకొచ్చింది. కాయదు తాగిన బాటిల్ తమ దగ్గర ఉందంటూ ఓఎల్ఎక్స్‌లో ప్రకటన పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు తిరుగుతున్నాయి. అయితే అసలు ఆ బాటిల్ ఎవరు తీసుకున్నారు, మూడు లక్షల ధర పెట్టింది ఎవరనేది మాత్రం తెలియలేదు. ఇప్పటివరకు ఒరిజినల్ ప్రకటన కూడా బయటపడలేదు.

తమిళంలో 'డ్రాగన్' సినిమాతో కాయదు లోహర్ ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఆమె లుక్స్‌కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగులో అల్లూరి, ఫంకీ, ది ప్యారడైజ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మలయాళ ప్రేక్షకులకు కూడా పరిచయమే. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను పట్టుకుని ఓ వాటర్ బాటిల్‌కు లక్షల్లో ధర పెట్టారనే ప్రచారం రావడం హాట్ టాపిక్‌గా మారింది.

సెలబ్రిటీలు వాడిన వస్తువులను వేలంలో అమ్మడం చూస్తుంటాం. క్రికెటర్ల బ్యాట్లు, జెర్సీలు, స్టార్ హీరోల కాస్ట్యూమ్స్‌కు లక్షల్లో ధర పలికిన సందర్భాలున్నాయి. కానీ కాయదు బాటిల్ వ్యవహారం మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఇక్కడ వేలం నిర్వహిస్తున్న సంస్థ లేదు. బాటిల్‌కు సంబంధించిన ప్రత్యేకమైన గుర్తింపు కూడా బయటకు రాలేదు. కేవలం హీరోయిన్ పేరు పెట్టి మూడు లక్షలు అడుగుతున్నారనే ప్రచారమే వైరల్ అవుతోంది.

ఇక నెటిజన్లకు ఇలాంటి వ్యవహారాలు దొరికితే మీమ్స్‌కు కొదవ ఉండదు. మూడు లక్షలు పెట్టి ఖాళీ బాటిల్ కొనడం కంటే ఆ డబ్బుతో ఏకంగా కొత్త బైకు, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవచ్చనే రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో హీరోయిన్ పేరు తగిలిస్తే చాలు, మామూలు వస్తువుకు కూడా భారీ రేటు పెట్టేయొచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది నిజమైన అమ్మకమా, ఎవరైనా సరదాగా సృష్టించిన పోస్టా అనేది మాత్రం బయటపడలేదు.

ఇలాంటి సమయంలో కాయదు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కూడా గమనార్హం. ఆమెకు తెలియకుండానే తన పేరు మీద ఈ ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఆ బాటిల్‌ను మూడు లక్షలకు కొన్నట్లు కూడా సమాచారం లేదు. ప్రస్తుతం అసలు ఓఎల్ఎక్స్ లిస్టింగ్‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. హీరోయిన్ తాగిన నీళ్ల బాటిల్ అంటూ మొదలైన ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో మంచి ఎంటర్టైన్మెంట్ టాపిక్ గా హైలెట్ అవుతోంది.