మనసుకు విశ్రాంతి కావాలి.. కయాదు పోస్ట్ వైరల్!
తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాను ప్రధాన వేదికగా ఉపయోగిస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇటీవల కాలంలో అదే సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 20 Jun 2026 4:54 PM ISTతమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాను ప్రధాన వేదికగా ఉపయోగిస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇటీవల కాలంలో అదే సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. మానసిక ఆరోగ్యం, పర్సనల్ టైమ్, ప్రశాంత జీవనశైలి కోసం సోషల్ మీడియా డీటాక్స్ పేరుతో విరామం తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ కూడా చేరారు. తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కయాదు లోహర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో ఓ ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మనసుకూ అంతే అవసరమని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
కొంతకాలంగా సోషల్ మీడియా నుంచి కాస్త వెనక్కి తగ్గాలనే ఆలోచనలో ఉన్నాను. స్క్రీన్‌కు అవతల ఉన్న జీవితాన్ని మరింత ఆస్వాదించాలని, నాతో నేను ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తోంది. అందుకే కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని కయాదు వెల్లడించారు. ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే తాను సోషల్ మీడియాలో లేకపోయినా తనకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్‌ను తన టీమ్ అఫీషియల్ అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తుందని స్పష్టం చేశారు. అందరికీ శాంతి, సంతోషం, ప్రేమ కలగాలి. త్వరలోనే మళ్లీ కలుద్దామంటూ కయాదు తన సందేశాన్ని ముగించారు. కయాదు ఈ ప్రకటన చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా స్పందిస్తున్నారు. మీ ఆరోగ్యం ముఖ్యం, మళ్లీ మరింత ఉత్సాహంగా తిరిగి రావాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెరుగుతున్న పని ఒత్తిడి, నిరంతర ఆన్‌లైన్ ఉనికి కారణంగా చాలామంది నటీనటులు మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక కెరీర్ పరంగా చూస్తే కయాదు లోహర్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న కథానాయికల్లో ఒకరు. ఇటీవల తమిళ సినిమా డ్రాగన్, మలయాళ సినిమా పల్లిచట్టంబిలో కనిపించిన ఆమె చేతిలో ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఐ యామ్ గేమ్, నాని నటిస్తున్న ది ప్యారడైస్, జీ.వి. ప్రకాశ్‌తో కలిసి ఇమ్మోర్టల్, అలాగే అథర్వా హీరోగా రూపొందుతున్న ఇదయం మురళి మరియు మారి సెల్వరాజ్ ప్రతిష్టాత్మక చిత్రం మంజనతి వంటి సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమైనా కయాదు పేరు మాత్రం వార్తల్లో కొనసాగుతూనే ఉండనుంది.
