Begin typing your search above and press return to search.

చేతిలో ఏడు సినిమాలు... ఐనా ఆశలన్నీ నానిపైనే..!

ఇంత అందమైన ముద్దుగుమ్మ గతంలో ఒక తెలుగు సినిమా చేసిందా అంటూ చాలా మంది గూగుల్‌ చేసి మరీ ఈమె గురించి తెలుసుకున్నారు.

By:  Ramesh Palla   |   18 Feb 2026 1:55 PM IST
చేతిలో ఏడు సినిమాలు... ఐనా ఆశలన్నీ నానిపైనే..!
X

టాలీవుడ్‌లో పరభాష హీరోయిన్స్ డామినేషన్‌ అనేది చాలా కామన్‌ విషయం. గత రెండు దశాబ్దాలుగా టాప్‌ హీరోయిన్స్‌గా కేవలం ముంబై ముద్దుగుమ్మలు లేదా కేరళ కుట్టీలు, బెంగళూరు బ్యూటీస్ మాత్రమే టాలీవుడ్‌లో కొనసాగుతూ వస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త ముద్దుగుమ్మలు ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకుల దృష్టి కాయాదు లోహర్‌ పై పడింది. ఈ అమ్మడు ఐదేళ్ల క్రితం అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడం తో పాటు, పాత్ర పరిధి పెద్దగా లేకపోవడంతో జనాలు ఆమెను కనీసం గుర్తించలేదు. దాంతో ఆ మధ్య తమిళ మూవీ డ్రాగన్‌ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలో అంతా షాక్ అయ్యారు. ఇంత అందమైన ముద్దుగుమ్మ గతంలో ఒక తెలుగు సినిమా చేసిందా అంటూ చాలా మంది గూగుల్‌ చేసి మరీ ఈమె గురించి తెలుసుకున్నారు.

టాలీవుడ్‌లో డ్రాగన్‌ తో కాయాదు లోహర్‌ ఎంట్రీ...

డ్రాగన్‌ సినిమా తమిళ్‌లోనే కాకుండా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈమెకు టాలీవుడ్‌ లోనూ ఆఫర్లు వచ్చాయి. తెలుగులో తాజాగా ఈమె ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతిరత్నాలు ఫేం అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా రూపొందిన ఫంకీ సినిమాలో హీరోయిన్‌గా కాయాదు లోహర్‌ నటించిన విషయం తెల్సిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దర్శకుడు అనుదీప్‌ రెగ్యులర్‌ రొటీన్‌ కామెడీ డ్రామాను చేశాడు అంటూ రివ్యూవర్స్ పెదవి విరిచారు. ప్రేక్షకులు అయినా థియేటర్‌ కి వస్తారా అంటే అది కూడా ఎక్కువ కనిపించడం లేదు. సినిమా వీక్ డేస్ లో మరీ వీక్‌ గా పెర్‌ఫామ్ చేస్తుందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాంతో ఫంకీ సినిమా ఫలితంపై క్లారిటీ వచ్చింది. కాయాదు లోహర్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

ఫంకీ సినిమాతో వచ్చిన...

టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ఫీచర్స్ చాలానే ఈ అమ్మడిలో ఉన్నాయి. కానీ సక్సెస్‌ లేకపోవడంతో మరిన్ని ఆఫర్లు తలుపు తట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫంకీలో లుక్ పరంగా, యాక్టింగ్‌ పరంగా ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. కనుక ఒకటి రెండు ఆఫర్లు కొత్తవి రావచ్చు. కానీ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావాలి అంటే మాత్రం కచ్చితంగా సూపర్‌ హిట్‌ లు ఖాతాలో ఉండాల్సిందే. అలాంటి సూపర్‌ హిట్‌ కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు మూవీ. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా కాయాదు లోహర్ నటిస్తోంది. టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌గా నిలవాలంటే కచ్చితంగా ఈ అమ్మడికి ది ప్యారడైజ్ సినిమా సూపర్‌ హిట్‌ కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాయాదు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

నాని, శ్రీకాంత్‌ ఓదెల ది ప్యారడైజ్‌ మూవీ...

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సినిమా సూపర్‌ హిట్‌గా నిలవడంతో పాటు, ఈ సారి అంతకు మించి అంటూ మొదటి నుంచి ప్రచారం చేస్తున్న కారణంగా ప్యారడైజ్ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నాని ఈ సారి అంతకు మించి అన్నట్లుగా ది ప్యారడైజ్‌ లో వైల్డ్‌ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది. శ్రీకాంత్‌ తన సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం దసరా సినిమా విషయంలో నిరూపితం అయ్యింది. అందుకే ఈ సినిమాలోనూ కాయాదు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటం ఖాయం. అదే నిజం అయ్యి, సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కాయాదు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌గా నిలుస్తుందని అంటున్నారు. అందుకే చేతిలో ఇతర భాషల సినిమాలు ఏడు ఉన్నా నాని పైనే ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ అమ్మడికి ప్యారడైజ్‌ హిట్‌ ఇచ్చేనా చూడాలి.