Begin typing your search above and press return to search.

రిస్కు తీసుకోవడంలో స్వీటీకి సిస్టర్‌లా ఉందే

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కాలాన్ని కేటాయించడం అనేది మామూలు విషయం కాదు.

By:  Sivaji Kontham   |   21 April 2026 10:56 AM IST
రిస్కు తీసుకోవడంలో స్వీటీకి సిస్టర్‌లా ఉందే
X

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కాలాన్ని కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. గతంలో `బాహుబలి` వంటి భారీ ఫ్రాంఛైజీ కోసం లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి తన కెరీర్‌లోని ఐదేళ్ల విలువైన సమయాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు అదే బాటలో యువ నటి కాయదు లోహర్ పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న `ప్యారడైజ్` సినిమా కోసం గత రెండేళ్లుగా మరే ఇతర ప్రాజెక్టుకు కమిట్ అవ్వకుండా తన సమయాన్ని పూర్తిగా కేటాయించింది. రిస్కు తీసుకోవడంలో కాయ‌దు కూడా అనుష్కకు చెల్లెలిలా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నిజానికి ఒక వర్ధమాన నటి కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సాహసం చేయడం చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి. కాయదు లోహర్ నటించిన ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. వరుస పరాజయాల నేపథ్యంలో కెరీర్ కి జాగ్ర‌త్త అవ‌స‌రం. ఇలాంటి స్థితిలో కొత్త ఆఫర్లను వదులుకుని.. కేవలం ఒక్క సినిమాపైనే ఆశలు పెట్టుకోవడం ఆమె కెరీర్‌ను రిస్కులో పడేసినట్లేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫలితం తేడా కొడితే ఆ ప్రభావం కెరీర్ పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

నాని `ప్యారడైజ్` చిత్రంలో కాయదు లోహర్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత్రలోని డెప్త్ వైవిధ్యం కారణంగానే కాయ‌దు రెండేళ్ల కాలాన్ని కేటాయించినట్లు సమాచారం. నాని వంటి ప్ర‌తిభావంతుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. పైగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించడం యువ‌న‌టికి ప్లస్ కానుంది.

సినిమా పరిశ్రమలో అన్ని భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉండటం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఒకే సినిమా కోసం ఏళ్ల తరబడి లాక్ అయిపోవడం వల్ల చేతికి అందే ఇత‌ర ఆఫర్లను కోల్పోవాల్సి వస్తుంది. గతంలో `సైజ్ జీరో` కోసం శరీరాకృతిని మార్చుకున్న అనుష్క ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కాయదు లోహర్ ప‌రిస్థితి అందుకు భిన్నం. కానీ ప్యారడైజ్ కోసం అలాగే ఎదురుచూస్తోంది. ఈ పాన్ ఇండియన్ సినిమా ఆమెకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అనుష్క తరహాలో ఈ రిస్క్ సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

యువ నటీమణులు వరుస సినిమాలు చేస్తూ ఫామ్‌లో ఉండటం ముఖ్యం. అయితే ప్యార‌డైజ్ లాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేయడం వల్ల గుర్తింపు వస్తుంది. అయితే భవిష్యత్తులో కాయ‌దు తన కెరీర్ ప్లానింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని.. ఒకే ప్రాజెక్టుపై ఆధారపడకుండా విభిన్న కథలను ఎంచుకోవాలని క్రిటిక్స్ సూచిస్తున్నారు. ప్యార‌డైజ్ విడుదల తర్వాత కాయదు లోహర్ టాలీవుడ్ టాప్ లీగ్‌లో చేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.