Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స‌వాళ్ల ఎదురైనా హుందాత‌నంలో త‌గ్గ‌రు

ముఖ్యంగా కత్రినా కైఫ్ గురించి చెప్పుకోవాలి. రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియోల్లో ముగ్గురు ఖాన్‌లు (సల్మాన్, షారుఖ్, అమీర్) త‌న‌ను ఆటపట్టిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినా ఏమాత్రం సహనం కోల్పోలేదు.

By:  Sivaji Kontham   |   7 March 2026 4:00 AM IST
టాప్ స్టోరి: స‌వాళ్ల ఎదురైనా హుందాత‌నంలో త‌గ్గ‌రు
X

సినిమా పరిశ్రమలో గ్లామర్ ఎంత ఉంటుందో తెర వెనుక అంతకు మించిన‌ సవాళ్లు కూడా ఎదుర‌వుతాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో లేదా బహిరంగ వేదికలపై స్టార్ హీరోలు ఒక్కోసారి సరదాగానో లేక కావాలనో చేసే వ్యాఖ్యలు కథానాయికలకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అయితే అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏమాత్రం తొణకకుండా, అపారమైన ఆత్మవిశ్వాసంతో ఎదురుదాడి చేయకుండానే హుందాగా సమాధానాలిచ్చిన కొందరు నటీమణులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ముఖ్యంగా కత్రినా కైఫ్ గురించి చెప్పుకోవాలి. రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియోల్లో ముగ్గురు ఖాన్‌లు (సల్మాన్, షారుఖ్, అమీర్) త‌న‌ను ఆటపట్టిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినా ఏమాత్రం సహనం కోల్పోలేదు. తనపై వచ్చే సెటైర్లను చాలా స్మార్ట్‌గా, వివేకంతో కూడిన సమాధానాలతో తిప్పికొడుతూ తనేంటో నిరూపించుకున్నారు. ఎదుటివారు తక్కువ చేసి మాట్లాడాలని చూసినా.. తన నవ్వుతోనే ఎదుటివారిని చిత్తు చేసే నేర్పు కత్రినా సొంతం.

ఇక సీనియర్ నటి `రేవతి` స్టైలే వేరు. ఆమె ఎప్పుడూ తన మేధస్సుతో, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానాలతో ఎదుటివారికి గౌరవం త‌గ్గ‌కుండానే చుర‌క‌లు వేస్తారు. ఎవరైనా తన నటనను లేదా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా మాట్లాడితే.. ఆమె గొంతు పెంచకుండానే తన తార్కిక సమాధానాలతో నోరు మూయిస్తారు. తన హుందాతనాన్ని ఎప్పుడూ పణంగా పెట్టకుండా సమాజం.. సినిమా విష‌యంలో తనకున్న అవగాహనతో రేవ‌తి ఇచ్చే జవాబులు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం.

సీనియ‌ర్ నటి రాధిక శరత్ కుమార్ కూడా ఇదే కోవలోకి వస్తారు. సుదీర్ఘ కెరీర్‌లో ఈ న‌టి ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. ఇంటర్వ్యూలలో హీరోలు ఆమెను డామినేట్ చేయాలని చూసినా, తనదైన బాడీ లాంగ్వేజ్‌తో .. కాన్ఫిడెన్స్‌తో ఆ పరిస్థితులను చక్కదిద్దుతారు. ఎదుటివారికి చిన్నచూపు చూసే అవకాశం ఇవ్వకుండా, తన అనుభవాన్ని , ప్రతిభను ఆయుధంగా మలచుకుని సమాధానాలు ఇవ్వడం రాధిక ప్రత్యేకత.

నేటి తరం నటీమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ తన బోల్డ్ , స్ట్రైట్ ఫార్వర్డ్ స్వభావానికి పెట్టింది పేరు. తనపై వచ్చే బాడీ షేమింగ్ కామెంట్లు లేదా సినీ బ్యాక్‌గ్రౌండ్ గురించిన విమర్శలకు ఆమె సూటిగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలిస్తారు. ఎవరైనా తనను చిన్నచూపు చూడాలని ప్రయత్నిస్తే.. ఏమాత్రం భయం లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కాపాడుకుంటారు. వ‌రూ మాటల్లో ఉండే స్పష్టత తోటి నటీమణులకు ఎంతో ధైర్యాన్నిస్తుంది.

అనుష్క శెట్టి కూడా ఇలాంటి సందర్భాల్లో ఎంతో నిబ్బరంగా వ్యవహరిస్తారు. స్టార్ హీరోలు సరదాగా చేసే కొన్ని కామెంట్లను హుందాగా తీసుకుంటూనే.. తన గౌరవానికి భంగం కలగకుండా సంభాషణను మలుపు తిప్పడంలో స్వీటీ సిద్ధహస్తురాలు. ఈ ఐదుగురు నటీమణులు నిరూపించింది ఒక్కటే.. ఎదుటివారు మనల్ని ఎలా చూస్తున్నారనేది ముఖ్యం కాదు.. మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాం.. ఆత్మవిశ్వాసంతో ఎలా సమాధానమిస్తున్నాం అనేదే ముఖ్యం.