కత్రినా బౌన్స్ బ్యాక్ పక్కా.. ఎప్పుడంటే?
ఐశ్వర్యా రాయ్ బచ్చన్.. కరీనా కపూర్.. అనుష్క శర్మ.. సమీరారెడ్డి..ఆలియాభట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు నటీమణుల్లో కామన్ విషయం ఒకటి ఉంటుంది.
By: Garuda Media | 21 Sept 2026 2:01 PM ISTఐశ్వర్యా రాయ్ బచ్చన్.. కరీనా కపూర్.. అనుష్క శర్మ.. సమీరారెడ్డి..ఆలియాభట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు నటీమణుల్లో కామన్ విషయం ఒకటి ఉంటుంది. వారు గర్భం దాల్చి ప్రసవం తర్వాత తమ మునుపటి షేప్ ను పోగొట్టుకోవటం.. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్లుగా కొంతకాలానికి వారి పూర్వ రూపాన్ని సొంతం చేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా వినాయకచవితి సందర్భంగా ముకేశ్ అంబానీ ఏర్పాటు చేసిన వేడుకకు భర్తతో హాజరైన కత్రినాను చూసి.. ప్రసవం తర్వాత ఆమె భారీగా బరువు పెరిగిన వైనాన్ని తప్పు పడుతూ పెట్టిన పోస్టులు చూసినప్పుడు వారి మనసులు ఎంత వికారంగా ఉంటాయా? అన్న భావన కలుగక మానదు.
ఎందుకంటే.. ప్రసవం ఏ మహిళకైనా మరో జన్మ లాంటిదే. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మాత్రమే కాదు.. ఆ తర్వాత రెండేళ్ల వరకు సదరు మహిళ శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని పంటి బిగువునా భరిస్తూ.. పుట్టిన పసికందు బాధ్యతను ఆనందంగా స్వీకరించటం ప్రతి మాతృమూర్తిలోనూ కనిపిస్తుంటుంది. సాదాసీదా మహిళ మొదలు స్టార్ నటీమణుల వరకు ఎవరికైనా ప్రసవనంతర ఇబ్బందులు తప్పవు. వీటిని అధిగమిస్తూనే.. తమ పూర్వ రూపాన్ని తిరిగి తెచ్చుకోవాలని తపిస్తుంటారు.
మామూలు వారితో పోలిస్తే స్టార్ సినీనటీమణులకు.. సెలబ్రిటీలకు.. ప్రముఖల ఇళ్లల్లోని వారి మీద పాత షేప్ లోకి రావాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇదెంత ఎక్కువగా ఉంటుందన్న దానికి కత్రినా ఉదంతమే నిదర్శనంగా చెప్పొచ్చు. అదే సమయంలో ఫలానా సమయంలోపు పాత షేప్ లోకి రావాలన్న ఆలోచనలు సైతం ఆరోగ్యానికి మంచివి కావని వైద్యనిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ప్రతి మహిళా శరీరం ప్రసవం తర్వాత రికవరీ కావటానికి దాని కంటూ సొంత సమయం తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఈ వాదనకు బలం చేకూరేలా చెప్పాలంటే.. స్టార్ నటీమణులనే తీసుకుందాం. సమీరారెడ్డి ప్రసవం తర్వాత తన పాత షేప్ లోకి రావటానికి ఆమెకు ఏకంగా రెండేళ్ల వరకు పట్టింది. ప్రసవం తర్వాత డిప్రెషన్.. బరువు పెరగటం లాంటి సమస్యలు తాను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె బరువు పెరిగిన వైనాన్ని నెగిటివ్ గా రియాక్టు అయిన వారి గురించి ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఎలాంటి తొందరపాటు లేకుండా సహజమైన జీవనశైలి మార్పులతో ఆమె మళ్లీ బరువు తగ్గిన వైనం అభినందనీయం. ఎంతమంది సమీరారెడ్డి మాదిరి అవగాహనతో ఉంటారన్నది అసలు ప్రశ్న.
సమీరా తర్వాత ఐశ్వర్యా రాయ్ బచ్చన్ విషయంలోకి వెళితే ఆమె బరువు తగ్గటానికి దాదాపు 12 నుంచొ 15 నెలలు సమయం పట్టింది. ఇప్పుడు కత్రినా మాదిరి అప్పట్లో ఆరాధ్య పుట్టిన తర్వాత ఆమె బరువు పెరిగిన తీరుపై విమర్శలు వచ్చినా.. వాటిని పట్టించుకోలేదు. సహజ పద్దతుల మార్గాన్ని అనుసరించి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకొని బరువు తగ్గే ప్రాసెస్ ను ఫాలో అయ్యారు. మరో స్టార్ నటీమణి కరీనాకపూర్ ఖాన్ సైతం తన ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మునుపటి రూపంలోకి రావటానికి ఆర్నెల్ల నుంచి ఎనిమిది నెలలు సమయం తీసుకున్నారు. కాకుంటే ఆమె తన బరువు తగ్గేందుకు.. యోగా.. పిలేట్స్.. న్యూట్రిషన్ డైట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెబుతారు.
వీరికి భిన్నంగా శిల్పాశెట్టి.. ఆలియాభట్..అనుష్క శర్మలు మాత్రం ఆర్నెల్లలోపే వారు తమ మునుపటి తిరిగి తెచ్చుకున్నారు. వీరందరిలోనూ శిల్పాశెట్టి కేవలం మూడు..నాలుగు నెలల్లోనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రసవం తర్వాత ఆమె దాదాపు 21 కేజీలు బరువు పెరిగినా.. కఠినమైన యోగాసనాలు.. హెల్తీ డైట్ ప్లాన్ ద్వారా అతి తక్కువ సమయంలోనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక్కడ మరో అంశాన్ని మర్చిపోకూడదు. శిల్పా యోగా ట్రైనర్. ఆమెకు బరువు తగ్గే విషయంలో ఏం చేయాలన్న దానికి మిగిలిన వారి కంటే ఎక్కువ అవగాహన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇక్కడ మా ఉద్దేశం ఏమంటే.. స్టార్ నటీమణులైనా.. ప్రసవం తర్వాత బరువు తగ్గే ప్రాసెస్ అందరికి ఒకేలా ఉండదన్న విషయాన్ని చెప్పటమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా.. ఫలానా వారు ప్రసవం తర్వాత ఇట్టే బరువు తగ్గారన్న పోలిక ఏ మాత్రం సరికాదన్నది మర్చిపోకూడదు. సెలబ్రిటీలు.. స్టార్ నటీమణులు.. ప్రముఖుల ఇళ్లల్లోని వారికి ప్రత్యేకంగా డైటీషియన్లు.. జిమ్ ట్రైనర్స్.. ఆయాల పరివారం ఎక్కువగా ఉంటుంది. సాదాసీదా ఇళ్ల్లల్లో ఇవన్నీ ఉండవు. వారి రోజువారీ బాధ్యతలతో పాటు.. బరువు తగ్గటమనే ఒత్తిడి సదరు మహిళకు ఎంత సమస్య అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. బరువు తగ్గే విషయంపై నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ప్రసవం తర్వాత స్టార్ నటీమణులు బరువు పెరగటం సహజమైన పరిణామం. వారంతా మనలాంటి మనుషులే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. గర్భధారణతో సగటు స్త్రీకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయో.. అలానే వారికి ఉంటాయన్న వాస్తవాన్ని వదిలేసి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటంలో అర్థం లేదు. అంతేకాదు.. బరువు ఆధారంగా ఒక మహిళను జడ్జ్ చేయటం సరికాదు. తమ మనసుకు తోచినట్లుగా ఉండాలని భావించటం సామాజిక నేరంగా చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కత్రినా ఉదంతం కొన్ని అంశాల మీద మనలో పెరగాల్సిన అవగాహన విషయాన్ని చెప్పేసింది.ః
ప్రసవం తర్వాత బరువు తగ్గటంలో ప్రతి మహిళ శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. అంతేకాదు.. మరో కీలక అంశం ఏమంటే.. వారు ఏ వయసులో తల్లి అయ్యారన్నది కూడా కీలకాంశం. ఆలియాభట్ 29 ఏళ్లకు తల్లి అయితే.. అనుష్క శర్మ 32 ఏళ్లకు.. కరీనా కపూర్ 36 ఏళ్లకు మొదటిసారి.. రెండోసారి 40 ఏళ్ల వయసులో..శిల్పాశెట్టి 37 ఏళ్ల వయసులో.. ఐశ్వర్యారాయ బచ్చన్ 38 ఏళ్ల వయసులో తల్లి అయితే..సమీరారెడ్డి 34 ఏళ్ల వయసులో మొదటిసారి.. 38 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి అయ్యారు.వీరందరికి భిన్నం కత్రినా ఉదంతం. ఎందుకంటే ఆమె తల్లి అయ్యేనాటికి ఆమె వయసు 42 ఏళ్లు.
సాధారణంగా ఏ మహిళకైనా 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందులోనూ 40 ఏళ్ల వయసులో తల్లి అయితే.. ఆ మార్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. మిగిలిన నటీమణులతో కత్రినాను పోల్చలేం. ఎందుకంటే ఆమె తల్లి కావటమే చాలా ఆలస్యంగా.. లేటు వయసులో అయ్యారు. అలాంటి వేళ.. ఆమె పూర్వపు రూపం గురించి మాట్లాడటం తప్పే అవుతుంది. 40 ఏళల వయసులో ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత మహిళల శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని మార్పుల గురించి తెలిస్తే.. వారి బరువు కంటే.. వారి ఆరోగ్యం బాగుంటే అదే పదివేలన్న భావన కలుగుతుంది.
ఇలాంటి విషయాల మీద అవగాహన లేక నోటికి వచ్చినట్లు మాట్లాడతారే తప్పించి.. అసలు విషయాలు తెలిస్తే.. 40 ఏళ్లు దాటిన మహిళ తల్లి అయితే.. ఆమె తన శరీరంతో తాను పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రసవం తర్వాత ఈస్ట్రోజెన్.. ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సాధారణ ప్రసవానంతర హార్మోన్ల పతనంతో పాటు.. ప్రతి మహిళకు ఎదురయ్యే మేనోపాజ్ కు ముందు పెరిమెనోపాజ్ తాలూకు హార్మోన్ల హెచ్చుతగ్గులు తోడవుతాయి. అంటే.. 40 ఏళ్లు దాటిన తర్వాత గర్భవతి అయిన మహిళ శరీరం డబుల ఇంపాక్ట్ కు గురవుతుందన్న మాట.
దీని కారణంగా వారు తీవ్రమైన అలసటతో పాటు తీవ్రమైన మైడ స్వింగ్స్ కు గురై.. ఆ సమస్య చాలాకాలం పాటు కొనసాగుతుంది. వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలో బీఎంఆర్ (బేసల్ మెటబాలిక్ రేట్)తో పాటు మైటో కాండ్రియా సామర్థ్యం సహజంగానే తగ్గుతాయి. ప్రసవం తర్వాత ఎదురయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో శరీరం క్యాలరీలను ఖర్చు చేయకుండా నిల్వ చేయటం మొదలుపెడుతుంది. మరి ముఖ్యంగా పొట్ట భాగంలో ఇది మరింత ఎక్కువ. 40 ఏళ్లు దాటిన తర్వాత తల్లులు అయ్యే వారు.. తమ పొట్ట భాగంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవటం వారికి చాలా పెద్ద సమస్య. ఎంతో కఠినమైన ప్రక్రియ కూడా.
వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి.. మజిల్ మాస్ (కండరాల ద్రవ్యరాశి) తగ్గుతుంది. గర్భధారణ సమయంలో పొట్ట కండరాలు విడిపోవటాన్ని డయాస్టాసిస్ రెక్టిగా చెబుతారు. 20 ఏళ్ల వయసులో ఉన్న మహిళలో ఈ కండరాలు.. చర్మం త్వరగా పాత రూపంలోకి వచ్చేస్తాయి. కానీ.. 40 ఏళ్లు దాటినవారిలో కండరాల పునరుద్ధరణ సామర్థ్యం తక్కువ. దీని కారణంగా పొట్ట తగ్గటం.. కండరాలు బిగుతుగా మారటానికి మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ సమయం పుడుతుంది. ప్రసవం సమయంలో మూత్రాశయం.. గర్బాశయాన్ని పట్టి ఉంచే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బాగా సాగుతాయి. 40 ఏళ్లు దాటిన తర్వాత తల్లి అయిన వారిలో ఈ కండరాల రికవరీ ఆలస్యమవుతుంది. మిగిలిన మహిళలతో పోలిస్తే.. 40 ఏళ్లు దాటిన తర్వాత తల్లి అయిన వారికి ఇదో అదనపు సమస్య.
మామూలుగానే బిడ్డ పుట్టిన తర్వాత దాదాపు ఏడాది వరకు తల్లులకు సరైన నిద్ర ఉండదు. 40 ఏళ్ల వయసులో నిద్రలేమి అనేది హార్మోన్ల అసమతుల్యత.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలను మరింత పెంచుతుంది. ఇది పెరిగినకొద్దీ శరీరం బరువును అస్సలు తగ్గనివ్వదు. దీంతో కణాల స్థాయిలో బాడీ హీల్ కావటానికి (సెల్యూలార్ రికవరీ) పట్టే సమయం వయసులో పెరుగుతుంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. 40 ఏళ్లు దాటిన తర్వాత తల్లి అయ్యే ప్రతి మహిళ బరువు తగ్గటానికి కనీసం రెండేళ్ల వరకు సమయం పడుతుంది. అది కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తని పక్షంలో. అందుకే.. ప్రసవం తర్వాత శరీర మార్పుల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే కన్నా.. వారి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా.. ఒకరి శరీరం గురించి మరొకరు మాట్లాడే హక్కు ఎక్కడిది? బాధ్యత లేనిచోట్ల హక్కు ఉండదన్నది మర్చిపోకూడదు.
