క్యాట్ కూడా సమంతలా పాట పాడుతుందే!
కత్రినా కైఫ్ వెండి తెరపై కనిపించి ఏడాదిన్నర దాటింది. `మేరీక్రిస్మస్` అనంతరం అమ్మడు ఇంతవరకూ మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు.
By: Srikanth Kontham | 24 Sept 2025 4:00 AM ISTకత్రినా కైఫ్ వెండి తెరపై కనిపించి ఏడాదిన్నర దాటింది. `మేరీక్రిస్మస్` అనంతరం అమ్మడు ఇంతవరకూ మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? అవకాశాలు రాక గ్యాప్ ఇచ్చిందా? వచ్చినా వద్దనుకుందా? లేక నచ్చిన కథలు రాకపోవడంతో వెయిట్ చేస్తోందా? లాంటి ఎన్నో సందేహాలు నెటి జనుల్లో వ్యక్తమవుతున్నాయి. కత్రినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి? అమ్మడు తలుచుకుంటే స్టార్ హీరోలతో సినిమాలు చేయగలదు. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం.
నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఎన్నో పరిచయాలు..ఎంతో మంది దర్శక, నిర్మాతలకు కావాల్సిన నటీమణి. అలాంటి నటికి అవకాశాలు రాకపోవడం అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా మనసుకు నచ్చిన పాత్రాలు రాకపోవడం అన్నది జరుగుతుంది. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్ట్ లు డిలే అవుతుంటాయి. ఇది ఓ ప్రధాన కారణం కావొచ్చు అన్నది కొంత మంది నెటి జనుల్లో నిన్నటి వరకూ ఉన్న అభిప్రాయం. అయితే కత్రినా వెర్షన్ మాత్రం మరోలా కనిపిస్తోంది. అమ్మడు సమంతలా కొత్త పల్లవి అందుకుంది.
ఇకపై తాను కూడా సెలక్టివ్ గా ఉంటానని...మనసుకు బాగా నచ్చితే తప్ప కొత్త సినిమాలేవి చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలను పోషించానని..ఇకపై తాను ఏ పాత్ర పోషించిన అది ఎంతో ప్రత్యేకంగా ఉంటే తప్ప కమిట్ అవ్వనంటోంది. అలాంటి పాత్రలు వచ్చే వరకూ ఎదురు చూస్తాను తప్ప! ఆలస్యమవుతోందని కంగారు పడి కొత్త సంతకాలు చేసేయనంటోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన పరాభవాలను గుర్తు చేసుకుంది.
కెరీర్ ఆరంభంలో దొర్లిన తప్పిదాలను కవర్ చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని...మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నటిగా ప్రేక్షకుల మనసులో గొప్ప స్థానం సంపాదిం చాలంటే .. చేసే పాత్రలు కూడా అంతే గొప్పగా ఉన్నప్పుడే సాద్యమవుతుందని అభిప్రాయపడింది. మరి క్యాట్ ఆశించినట్లు ఆ రకమైన పాత్రలు బాలీవుడ్ లో సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి.
