తమిళనాడులో ఈ నటిని తాగుబోతు అని పిలుస్తున్నారు
ప్రముఖ నటి కస్తూరి నిత్యం ఏదో ఒక వివాదంతోనో లేదా సోషల్ మీడియాలో తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలతోనో వార్తల్లో నిలుస్తుంటారు.
By: Sivaji Kontham | 31 March 2026 9:49 AM ISTప్రముఖ నటి కస్తూరి నిత్యం ఏదో ఒక వివాదంతోనో లేదా సోషల్ మీడియాలో తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలతోనో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తనకున్న ఒక వింతైన అడిక్షన్ గురించి బయటపెట్టారు. అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు యాంకర్ 9 పీఎం తర్వాత....! అంటూ ఫన్నీ ప్రశ్న సరదాగా నవ్వించింది. ``ఇప్పటికే తమిళనాడులో తనను ఒక తాగుబోతు అని ప్రచారం చేస్తున్నారని.. ఇప్పుడు మళ్ళీ తనకున్న అడిక్షన్ గురించి చెబితే జనం ఏమనుకుంటారో`` అని నటి కస్తూరి సరదాగా వ్యాఖ్యానించారు. తనపై వచ్చే పుకార్లను ఈ సీనియర్ నటి ఎంత లైట్ గా తీసుకుంటారో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ డైట్ విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. కానీ కస్తూరి మాత్రం రాత్రి సమయాల్లో తనకు కలిగే తహతహ గురించి నిజాయితీగా మాట్లాడారు. ప్రతిరోజూ రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తన మనసు ఏదో ఒక రుచికరమైన పదార్థం కోసం తహతహలాడుతుందని.. ఆ సమయంలో ఆ ఆకలిని లేదా ఆ కోరికను అదుపు చేసుకోవడం తన వల్ల కాదని కస్తూరి చెప్పుకొచ్చారు. ఈ అలవాటు తనను ఒక అడిక్షన్ లా మార్చేసిందని చమత్కరించారు.
అయితే ఆ అడిక్షన్ మరేదో కాదు.. కేవలం బంగాళదుంప చిప్స్ తినడం. వినడానికి ఇది చాలా సాదాసీదాగా అనిపించినా.. తనకు ఆ చిప్స్ అంటే ఎంత ప్రాణమో వివరిస్తూ.. ఆ సమయంలో ఎంత వద్దనుకున్నా వాటిని తినకుండా ఉండలేనని తెలిపారు. ఆరోగ్య స్పృహ ఉన్నా కానీ.. రాత్రి వేళల్లో (9పీఎం) పొటాటో చిప్స్ ఇచ్చే కిక్కు ముందు మరేదీ పని చేయదని ఆ ఇంటర్వ్యూలో సరదాగా వెల్లడించారు.
ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తిన్నప్పుడు మనందరికీ కలిగే గిల్టీ ఫీలింగ్ కస్తూరికి కూడా తక్కువేమీ కాదు. రాత్రి పూట చిప్స్ కవర్లు ఖాళీ చేసేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే తనపై తనకే అసహ్యం వేస్తుందని వాపోయారు. ``ఎందుకు తిన్నాను? ఇకపై అస్సలు తినకూడదు`` అని గట్టిగా నిర్ణయం తీసుకుంటానని.. కానీ మళ్ళీ రాత్రి 9 గంటలు కాగానే పాత కథే పునరావృతమవుతుందని.. ఆ చిప్స్ రుచికి తాను లొంగిపోతానని కస్తూరి తెలిపారు.
మొత్తానికి.. నటి కస్తూరి తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇటీవల వీడియో క్లిప్స్ రూపంలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనపై వచ్చే నెగటివ్ ప్రచారాన్ని జోక్ గా మలుచుకుంటూనే.. తనలోని సాధారణ మహిళను ప్రేక్షకులకు పరిచయం చేశారు. నటీమణులు సెలబ్రిటీలకైనా.. సామాన్యులకైనా రాత్రి పూట వచ్చే చిప్స్ క్రేవింగ్స్ ఒకేలా ఉంటాయని కస్తూరి మాటలు నిరూపిస్తున్నాయి. శంకర్ తెరకెక్కించిన భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ చెల్లెలు పాత్రలో నటించిన కస్తూరి, ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో టీవీ సీరియళ్లతోను అందరికీ చేరువయ్యారు. ఇటీవల సోషల్ మీడియాల్లో స్వేచ్ఛగా తన అభిప్రాయలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడం ద్వారా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
