Begin typing your search above and press return to search.

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

‘నువ్వు లేక నేను లేను’ సినిమా షూటింగ్‌లో ఆర్తి అగర్వాల్ తండ్రి కారణంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయని దర్శకుడు కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ఆయనకు తెలియకుండా అవసరమైన సీన్లు పూర్తి చేసేందుకు వేర్వేరు కార్లలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసేవారట. తరుణ్, ఆర్తి మధ్య విభేదాలను తొలగించేందుకు ఒకే కూపేలో ప్రయాణించేలా చేసినట్లు తెలిపారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   19 Nov 2026 8:00 PM IST
ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!
X

టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ ఒకరు. ముఖ్యంగా తరుణ్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరి జోడీకి అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అలాంటి హిట్ జంట నటించిన చిత్రాల్లో నువ్వు లేక నేను లేను కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు కాశీ విశ్వనాథ్ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాశీ విశ్వనాథ్ ఈ సినిమా నిర్మాణ సమయంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ తండ్రి విషయంలో తాను తీసుకున్న కొన్ని జాగ్రత్తల గురించి వివరించారు. ఆర్తి సినిమాల్లో నటించే సమయంలో ఆమె తండ్రి చాలా జాగ్రత్తగా ఉండేవారట. తన కుమార్తె విషయంలో కొన్ని పరిమితులు ఉండాలని ఆయన భావించేవారు. ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్ ఉన్న సన్నివేశాలు చేయడానికి ఇష్టపడేవారు కాదంట. అందుకే షూటింగ్ సమయంలో కూడా ఆయన ఎక్కువగా అక్కడే ఉండేవారని దర్శకుడు చెప్పారు.

అయితే ఆర్తి అగర్వాల్ మాత్రం తన పాత్ర విషయంలో చాలా కరెక్ట్ గా ఉండేవారని కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఒకసారి ఏదైనా పాత్రకు అంగీకరిస్తే, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయాలని ఆమె భావించేవారట. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం దర్శకుడికి సవాలుగా మారిందట. ఆర్తి తండ్రి షూటింగ్ దగ్గర ఉంటే కొన్ని సన్నివేశాలు తీయడం కష్టమయ్యేదని చెప్పారు. అందుకే ఆయనను వేరే కారులో తీసుకురావడం, కొన్నిసార్లు రెండు వేర్వేరు కార్లలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసేవారట. ముఖ్యంగా ఆర్తి తండ్రి ఉండే కారు డ్రైవర్‌ను మరో గంట ఆలస్యంగా తిరిగి రావాలని చెప్పేవారట. ఆ సమయంలో అవసరమైన సన్నివేశాలను పూర్తి చేసేవారని కాశీ విశ్వనాథ్ వెల్లడించారు.

ఆ సమయంలో ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇద్దరూ సన్నివేశాల్లో చక్కగా నటించేవారని, అనుకున్నట్లుగానే షాట్ వచ్చిందని యూనిట్ సభ్యులు, తరుణ్ సంతోషించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇదే పాడ్‌కాస్ట్‌లో తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య ఒక పాట చిత్రీకరణకు ముందు వచ్చిన చిన్నపాటి విభేదాల గురించి కూడా మాట్లాడారు. 'నిండు గోదారి కథ' పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య మాటలు లేవట. దీంతో పాటలో కనిపించాల్సిన భావోద్వేగాలు తెరపై సరిగ్గా కనిపించవని ఆయన భావించారు. రాజమండ్రికి వెళ్లే ప్రయాణంలో ఇద్దరినీ ఒకే కూపేలో ఉంచి మాట్లాడేలా ప్రయత్నించారట. అలా వారి మధ్య ఉన్న దూరం తగ్గడంతో పాట చిత్రీకరణ కూడా బాగా వచ్చిందని చెప్పారు.