కలల కోసం కన్నవారికి దూరం..యువనటి ఎమోషనల్ జర్నీ
గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం, అనుకున్న గుర్తింపు తెచ్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
By: Sivaji Kontham | 23 May 2026 9:40 AM ISTగ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం, అనుకున్న గుర్తింపు తెచ్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టే యువతులకు ఇక్కడ ప్రతి అడుగు ఒక సవాలే. తాజాగా పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక నటి, తన కెరీర్ కోసం తీసుకున్న అత్యంత కఠినమైన వ్యక్తిగత నిర్ణయం గురించి రివీల్ చేయడం షాకిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే క్రమంలో ఈ నటి తన కుటుంబానికి, బంధువులకు దూరం కావాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు.
చిత్ర పరిశ్రమలో ప్రయాణం ప్రారంభించిన కొత్తలో తాను ఎదుర్కొన్న మానసిక ఆందోళన గురించి, ఎమోషనల్ స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో సదరు నటీమణి మనసు విప్పి మాట్లాడారు. తన కలల కోసం ప్రాణప్రదమైన బంధుత్వాలను వదులుకోవడం తన జీవితంలోనే తాను తీసుకున్న అతిపెద్ద రిస్క్ అని అభివర్ణించారు. ఆ క్లిష్ట సమయంలో చుట్టూ ఉన్న వారెవరూ తనకు మద్దతుగా నిలవలేదని.. తీవ్రమైన ఒంటరితనం వెంటాడిందని పేర్కొన్నారు. ఒకానొక దశలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. తనను బహిరంగంగానే వెలివేయవచ్చని .. తమకు సంబంధం లేదని ప్రకటించారని కూడా తెలిపింది.
అలాంటి గడ్డు కాలంలో అందరూ దూరమైనా తనకు కేవలం తన తల్లి మాత్రమే వెన్నుదన్నుగా నిలిచారు. బంధువులు, సమాజం నుండి వచ్చిన ఒత్తిడిని తట్టుకుంటూ.. మానసికంగా ఎంతో కుంగిపోయినా.. ఈ నటి తన ఆశయాలను మాత్రం వదులుకోలేదు. చుట్టూ జనం ఉన్నా ఒంటరిగానే సాగిన ఈ ప్రయాణంలో ఆ ఒంటరితనాన్ని ఒక శాపంగా కాకుండా తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకున్నానని సదరు నటీమణి చెప్పారు. లొంగిపోవడం కంటే ఒంటరిగా పోరాడడమే మేలనే పట్టుదల, దృఢ సంకల్పం తనను పరిశ్రమలో ముందుకు నడిపించాయి.
కశ్మీర్ ప్రాంతానికి చెందిన ఈ నటి 2025లో స్ట్రీమ్ అయిన బిగ్ బాస్ సీజన్ 19తో దేశవ్యాప్త ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. ఈ షోలో సదరు బ్యూటీ ప్రదర్శించిన బోల్డ్ నెస్ .. నిర్మొహమాటంగా మాట్లాడే నైజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు అమాన్ మల్లిక్ అల్బమ్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం `ఖత్రోన్ కే ఖిలాడీ` సీజన్ 15 లో అడ్వెంచర్స్ చేస్తూ తన శారీరక, మానసిక దృఢత్వాన్ని నిరూపించుకుంటున్నారు. కలల కోసం సర్వస్వం వదులుకున్నా ఈ ప్రయాణం గురించి మీరైతే ఎలా విశ్లేషస్తారు?
