Begin typing your search above and press return to search.

క్లాసిక్ డైరెక్ట‌ర్ ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర!

ప్రేమకథలకు కొత్త అందాన్ని, హుందాతనాన్ని అద్దిన దర్శకుడు కరుణాకరన్. వెండితెరపై పెయింటింగ్‌లాంటి దృశ్యాలను ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు.

By:  Srikanth Kontham   |   21 April 2026 12:21 PM IST
క్లాసిక్ డైరెక్ట‌ర్ ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర!
X

ప్రేమకథలకు కొత్త అందాన్ని, హుందాతనాన్ని అద్దిన దర్శకుడు కరుణాకరన్. వెండితెరపై పెయింటింగ్‌లాంటి దృశ్యాలను ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. అయితే గత ఎనిమిదేళ్లుగా క‌రుణాక‌ర‌న్ మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. చివ‌రిగా మెగా మేన‌ల్లుడు సాయితేజ్ తో `తేజ్ ఐల‌వ్ యూ `అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు.ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌రుణాక‌ర‌న్ నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. ఈ ఎనిమిదేళ్ల గ్యాప్ లో మ‌ళ్లీ సినిమాలు చేస్తారా? లేదా? అని కూడా మీడియాలో ఎక్క‌డా ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. దీంతో క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడిగా రిటైర్మెంట్ తీసుకున్నాడ‌ని అనుకున్నారంతా.

ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా బెల్లంకొడ గ‌ణేష్ హీరోగా ఓ కొత్త సినిమాను లాంచ్ చేసి అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసారు. ఆ సినిమా ప్రారంభోత్స‌వం నేడే జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంద‌రు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు పాల్గొన్నారు. ఒక్క‌సారి క‌రుణాక‌రన్ గ‌త చిత్రాల్లోకి వెళ్తే...కరుణాకరన్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది `తొలిప్రేమ`. పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు. ప్రేమకథా చిత్రాలకు అదొక పాఠ్యపుస్తకంలా నిలిచిపోయింది. అటుపై `వాసు`, `ఉల్లాసంగా ఉత్సాహంగా`, `డార్లింగ్` వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ సృష్టించుకున్నారు.

ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు గౌరవప్రదంగా, హీరోల క్యారెక్టరైజేషన్ కూల్‌గా ఉండటం కరుణాకరన్ స్పెషాలిటీ. చివరిగా 2018లో `తేజ్ ఐ లవ్ యూ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చినా? ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, తనదైన శైలిని కోల్పోకుండా ఒక పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునేందుకే ఈ ఎనిమిదేళ్ల సమయాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ఒక దర్శకుడికి ఇంత సుదీర్ఘ విరామం అనేది సవాలుతో కూడుకున్నదే. అయినా కరుణాకరన్ వంటి క్లాసిక్ మేకర్‌కు అది పునప్రారంభానికి వేదిక కానుంది.

కంబ్యాక్ మూవీలో బెల్లంకొండ గణేష్ హీరోగా నటించనుండటం ఆసక్తికరం. గణేష్ తొలి సినిమాతోనే సాఫ్ట్ రోల్స్‌కు సరిపోతాడ‌ని నిరూపించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో కరుణాకరన్ మార్క్ ఫీల్-గుడ్ ఎలిమెంట్స్ గణేష్ బాడీ లాంగ్వేజ్కు ప‌క్కాగా సరిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త జంటను, సరికొత్త ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించేందుకు కరుణాకరన్ సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుత వెండితెరపై యాక్షన్, వయోలెన్స్ , డార్క్ కంటెంట్ రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కరుణాకరన్ మళ్ళీ తన మార్కు స్వచ్ఛమైన ప్రేమకథతో రావడం అనేది ప్రేక్షకులకు రీప్రెష్ మెంట్ లా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా, మనసును హత్తుకునే సంభాషణలతో ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతుంది. దీంతో ఎనిమిదేళ్ల విరామం తర్వాత క‌రుణాక‌ర‌న్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలా పని చేస్తుందో చూడాలి.