Begin typing your search above and press return to search.

మరీ ఇంత గ్యాప్ అంటే ఎలా కార్తికేయ?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కు టాలెంట్ ఎంత అవసరమో.. వరుస సినిమాలతో సందడి చేస్తుండడం కూడా అంతే అవసరం.

By:  M Prashanth   |   18 Feb 2026 8:30 AM IST
మరీ ఇంత గ్యాప్ అంటే ఎలా కార్తికేయ?
X

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కు టాలెంట్ ఎంత అవసరమో.. వరుస సినిమాలతో సందడి చేస్తుండడం కూడా అంతే అవసరం. ఒక సినిమా తర్వాత మరొక మూవీకి మధ్య కాస్త బ్రేక్ ఉండడం అన్ని విధాలుగా మంచిదే కానీ.. ఆ గ్యాప్ మరీ ఎక్కువైతే మాత్రం ప్రేక్షకుల్లో ఐడెంటిటీ తగ్గిపోవడం ఖాయం. ఇప్పుడు ఇదే పరిస్థితి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విషయంలో కనిపిస్తోంది.

కార్తికేయ అంటే వెంటనే అందరికీ గుర్తు రాకపోయినా.. ఆర్ఎక్స్ 100 మూవీ హీరో అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంతో కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది. యూత్‌ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. అదే సమయంలో అప్ కమింగ్ మూవీలపై అందరి దృష్టి పడింది.

ఆ తర్వాత బెదురు లంక వంటి పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కార్తికేయ. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేశారు. హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించగల టాలెంట్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వాలిమై సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు. ఆ పాత్ర ఆయనకు తమిళ ప్రేక్షకుల్లో గుర్తింపు తీసుకొచ్చింది.

అయితే గత కొంతకాలంగా కార్తికేయ నుంచి కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. 2024లో వచ్చిన భజే వాయు వేగం మూవీ తర్వాత ఆయన నుంచి మరో సినిమా గురించి క్లారిటీ రాలేదు. ఆ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కార్తికేయ తన తదుపరి సినిమా షూటింగ్ ను పూర్తి చేసి టీజర్‌ తో సడెన్ గా సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. భజే వాయు వేగం విషయంలో కూడా ఇదే ప్లాన్ ఫాలో అయ్యారని చెబుతున్నారు. అయితే ఆ విషయం ఎంతవరకు నిజమో క్లారిటీ లేదు. కానీ ఇలాంటి ప్లాన్లు ఎప్పుడూ వర్కౌట్ అవుతాయనే గ్యారెంటీ లేదు.

ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుకుంటున్నారు. కనీస సమాచారం లేకుండా హీరో పూర్తిగా కనిపించకుండా ఉంటే, ఆసక్తి తగ్గిపోవడం సహజం. దీంతో స్టార్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏదేమైనా కార్తికేయ వంటి టాలెంటెడ్ నటుడు కెరీర్‌ లో ఇలాంటి పెద్ద గ్యాప్‌ తీసుకోవడం రిస్క్ అనే చెప్పాలి. సరైన కథ, ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తేనే ఆయన మళ్లీ ఫామ్‌ లోకి రావచ్చు. ఇకపై కార్తికేయ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.