Begin typing your search above and press return to search.

న‌యా సెలబ్రిటీ క్రేజ్: స్టార్ హీరోలు క్యూ కడుతున్న లగ్జరీ కార్ ఏదో తెలుసా?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రస్తుతం సినీ సెలబ్రిటీలందరి దృష్టి ఒకే రకమైన వాహనంపై పడింది.

By:  Sivaji Kontham   |   8 April 2026 4:00 AM IST
న‌యా సెలబ్రిటీ క్రేజ్: స్టార్ హీరోలు క్యూ కడుతున్న లగ్జరీ కార్ ఏదో తెలుసా?
X

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రస్తుతం సినీ సెలబ్రిటీలందరి దృష్టి ఒకే రకమైన వాహనంపై పడింది. సాధారణంగా వేగంగా వెళ్లే స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే తారలు.. ఇప్పుడు సౌకర్యానికి పెద్దపీట వేస్తూ మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, సీనియర్ నిర్మాత బోనీ కపూర్ ఒకే రోజు ఈ విలాసవంతమైన కారును కొనుగోలు చేయడం విశేషం. సుమారు 1.8 కోట్ల రూపాయల విలువైన ఈ కారు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ కేవలం ఒక కారు మాత్రమే కాదు.. ఇది ఒక `రోడ్లపై నడిచే ప్రైవేట్ జెట్` అని చెప్పవచ్చు. దీని లోపల ఉండే సీటింగ్ అమరికను ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా 180 డిగ్రీల వరకు వెనక్కి వాల్చుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌లలో లేదా షూటింగ్ లోకేషన్లకు వెళ్లేటప్పుడు నటీనటులు ఎంతో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఈ కారులో అద్భుతమైన స్థలం ఉంటుంది. అందుకే కార్తీక్ ఆర్యన్, బోనీ కపూర్ వంటి బిజీ సెలబ్రిటీలు తమ విలాసవంతమైన గ్యారేజీలో ఈ మోడల్‌ను కూడా చేర్చుకున్నారు.

బాలీవుడ్ కి స‌మాంత‌రంగా ల‌గ్జ‌రీ కార్ల క్రేజ్ టాలీవుడ్ హీరోలకు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఈ బెంజ్ వి-క్లాస్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య, కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వంటి యువ హీరోల కన్ను ఈ కారుపై పడిందని.. ఇప్పటికే వీరు అడ్వాన్సులు కూడా ఇచ్చారని ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ తారలు ఇలాంటి విలాసవంతమైన మల్టీ-పర్పస్ వెహికల్స్ (ఎంపివీలు) వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ప్రయాణ సమయంలో లభించే గోప్యత, భద్రత. షూటింగ్ సెట్స్‌లో క్యారావాన్ అందుబాటులో లేని చోట్ల ఈ కారు ఒక చిన్న ఆఫీసులా లేదా విశ్రాంతి గదిలా ఉపయోగపడుతుంది. అలాగే, బాడీగార్డ్స్, మేకప్ సిబ్బందితో కలిసి ప్రయాణించడానికి కూడా ఇది ఎంతో అనువైనది. అందుకే ఇప్పుడు మన స్టార్ హీరోలు స్పోర్ట్స్ కార్ల కంటే ఇలాంటి ఫంక్షనల్ లగ్జరీ వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈ మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ని సొంతం చేసుకోవ‌డం అనేది సినీ సర్కిల్స్‌లో ఒక గొప్ప స్టేటస్ సింబల్‌గా మారింది. అధునాతన 360-డిగ్రీల కెమెరా, అటెన్షన్ అసిస్ట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో పాటు... రాజసం ఉట్టిపడే దీని లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. మునుముందు మరికొంతమంది స్టార్ హీరోల గ్యారేజీల్లో ఈ స్పెష‌ల్ కారు ప్రత్యక్షమవ్వడం ఖాయం. కింగ్ ఖాన్ షారూఖ్ నుంచి యువ హీరోల వరకు అందరూ ఈ క్లాస్ కారు వెంట పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.