Begin typing your search above and press return to search.

పర్సనాలిటీ రైట్స్ రక్షణలో యువ హీరో !

బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కీలకమైన అడుగు వేశాడు.

By:  Srikanth Kontham   |   16 April 2026 8:00 AM IST
పర్సనాలిటీ రైట్స్ రక్షణలో యువ హీరో !
X

బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కీలకమైన అడుగు వేశాడు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వంటి దిగ్గజ నటుల బాటలోనే కార్తీక్ కూడా తన పేరు, గొంతు, పోలికలు , సంతకాన్ని ఇతరులు వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వాడకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు, కార్తీక్ ఆర్యన్ హక్కులకు భంగం కలగకుండా అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - డీప్‌ఫేక్ టెక్నాలజీల వినియోగం విపరీతంగా పెరిగింది.

సెలబ్రిటీల అనుమతి లేకుండా గొంతును అనుకరించడం లేదా వారి ఫోటోలను మార్చి సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రదర్శించడం వంటి ఘటనలు నటుల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత బ్రాండ్ విలువను కాపాడుకోవడానికి కార్తీక్ ఆర్యన్ చట్టపరమైన రక్షణ కోరుకున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, గాయకుడు కుమార్ సాను వంటి వారు తమ పర్సనాలిటీ రైట్స్‌ను క్లెయిమ్ చేశారు. కార్తీక్ ఆర్యన్ ఈ జాబితాలో చేరడం తో సీనియర్ నటులే కాకుండా నేటి తరం స్టార్స్ కూడా డిజిటల్ హక్కుల పట్ల ఎంత అవగాహనతో ఉన్నారో అర్థమవుతోంది.

ఈ రక్షణ వల్ల కార్తీక్ అనుమతి లేకుండా ఆయన గొంతును లేదా రూపాన్ని ఏ కంపెనీ కూడా వాణిజ్యపరంగా వాడుకోవడానికి వీలుండదు. న్యాయపరమైన ఉత్తర్వుల వల్ల ప్రకటనలకే కాకుండా, మొబైల్ రింగ్‌టోన్లు, టీ-షర్టులపై ప్రింట్లు, ఏఐ ఆధారిత అనుకరణలపై కూడా నిషేధం విధిస్తారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలను కేవలం వారి అంగీకారంతోనే ఉపయోగించుకోవాలనే నిబంధనను ఈ తీర్పు మరింత బలోపేతం చేయనుంది.

కార్తీక్ ఆర్యన్ తీసుకున్న ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమలో సానుకూల పరిణామంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా, కళాకారుల ప్రతిభను , వారి శ్రమతో సంపాదించుకున్న గుర్తిం పును అక్రమ వినియోగం నుండి కాపాడుకోవడానికి బలమైన కవచంలా మారుతుంది. భవిష్యత్తులో మరి కొంతమంది యువ నటీనటులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ న‌టుడిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదిం చుకున్నాడు. త‌క్కువ బ‌డ్జెట్ లో నే బ‌ల‌మైన కంటెంట్ ఉన్న క‌థ‌ల్లో న‌టించి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నాడు.