Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

ప్ర‌పంచ దేశాల్లో భార‌త‌దేశ గౌర‌వాన్ని వంద రెట్లు పెంచిన `ఆప‌రేష‌న్ సింధూర్` గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Sivaji Kontham   |   4 Nov 2026 6:00 AM IST
ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!
X

ప్ర‌పంచ దేశాల్లో భార‌త‌దేశ గౌర‌వాన్ని వంద రెట్లు పెంచిన `ఆప‌రేష‌న్ సింధూర్` గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ముష్క‌ర పాకిస్తాన్ కి స‌రైన బుద్ధి చెప్ప‌డంలో భార‌త‌దేశ ఆర్మీ ద‌ళాలు ప్ర‌ద‌ర్శించిన సాహ‌స‌విన్యాసాలు అసాధార‌ణ‌మైన‌వి. ప‌హ‌ల్గామ్ ఎటాక్స్ కి ప్ర‌తీకారంగా చేసిన ఈ దాడుల్లో దాయాది దేశం పాకిస్తాన్ చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన స్థితిలో రాజీ బేరానికి వ‌చ్చింది. అయితే నాటి భార‌త సైన్యం వైమానిక ద‌ళాల సాహ‌స ఘ‌ట్టాల‌ను వెండితెర‌కెక్కించేందుకు చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉవ్విళ్లూరినా ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై సినిమానే తీయ‌లేదు. అయితే ఇప్ప‌టికి ఒక ప్రాజెక్ట్ ఖాయ‌మైంది.

బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్, సంచలన చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాంబినేషన్‌లో ఓ భారీ మిలిటరీ యాక్షన్ థ్రిల్లర్ రూపుదిద్దుకోనుంది. `ఆపరేషన్ సిందూర్‌` టైటిల్‌తోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించనున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. `టైనీ` ధిల్లాన్ రాసిన `ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్తాన్` అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను భూషణ్ కుమార్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ `టి-సిరీస్`.. వివేక్ అగ్నిహోత్రికి చెందిన `ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్` సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలు .. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత సైన్యం జరిపిన రహస్య మిలిటరీ ఆపరేషన్ల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. భారత సాయుధ దళాలలోని పలు విభాగాల ప్రత్యక్ష భాగస్వామ్యంతో.. సమగ్రంగా గ్రౌండ్ లెవ‌ల్ లో పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ యెమెన్ యుద్ధ నేపథ్యంతో షిమిత్ అమిన్ తెరకెక్కిస్తున్న `కెప్టెన్ ఇండియా` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే అత‌డు `ఆపరేషన్ సిందూర్` చిత్రీకరణలో పాల్గొననున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా.. ఎటువంటి హంగామా లేకుండా స్పష్టమైన ఆధారాలతో భారత సైన్యం సాధించిన విజయాలను వెండితెరపై ఆవిష్కరించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని చిత్ర బృందం పేర్కొంది.

మరోవైపు కార్తీక్ ఆర్యన్ ఖాతాలో ఇతర క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. `ఫుక్రే` ఫ్రాంచైజ్ దర్శకుడు మృగ్‌దీప్ సింగ్ లాంబ దర్శకత్వంలో కరణ్ జోహార్, మహావీర్ జైన్ నిర్మిస్తున్న `నాగ్‌జిల్లా` చిత్రంలో కార్తీక్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా దక్షిణాది నటి ప్రీతి ముకుందన్ హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం.