మరో బయోపిక్ లో ఛాంపియన్!
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడా? అంటే సన్నివేశం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 19 March 2026 8:00 AM ISTబాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడా? అంటే సన్నివేశం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చందు ఛాంపియన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో స్ఫూర్తిదాయక బయోపిక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..కార్తీక్ ఆర్యన్ తన తదుపరి చిత్రంలో కాశ్మీర్ కి చెందిన యువ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ తాజ్ ముల్ ఇస్లాం జీవిత కథలో నటించబోతున్నాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే? చందు ఛాంపియన్ వంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్ మళ్ళీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికే ఒక నేషనల్ అవార్డును అందించడంతో? తాజా ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక సాధారణ యువతి అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు.
సాధారణంగా చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలు బయోపిక్‌లు చేయడానికి వెనుకాడతారు. కానీ కార్తీక్ ఆర్యన్ మాత్రం శారీరక శ్రమతో కూడిన నటనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుం టున్నాడు.
చందు ఛాంపియన్ కోసం ఆయన చేసిన మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా తాజ్ ముల్ ఇస్లాం బయోపిక్ కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆయనను కేవలం ఒక కమర్షియల్ హీరోగానే కాకుండా,వర్సటైల్ యాక్టర్‌గా బాలీవుడ్ అగ్రస్థానంలో నిలబెట్టే అవకాశం ఉంది. ఒక నటుడు వరుసగా రెండు బయోపిక్‌లు చేయడం అందులోనూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉండటం అనేది పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.
అయితే కబీర్ ఖాన్ మేకింగ్ స్టైల్, కార్తీక్ అంకితభావం చూస్తుంటే? ఈ సినిమా మరో జాతీయ అవార్డు రేంజ్ లో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాశ్మీర్ లోని సున్నితమైన పరిస్థితులు, అక్కడ ఒక క్రీడాకారిణి ఎదుర్కొన్న సవాళ్లు వంటి అంశాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హిట్ అయితే కార్తీక్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. కార్తీక్ ఆర్యన్ కమిట్ మెంట్లు చూస్తుంటే? బాలీవుడ్ రియల్ లైఫ్ హీరో గా మారుతున్నాడా అనిపిస్తుంది.చందు ఛాంపియన్ అందించిన విజయంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది. మరి ఈ తాజా బయోపిక్ ద్వారా ఆయన మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అవార్డుల వేటను కొనసాగిస్తాడా? లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా? వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కార్తీక్ సాగిస్తున్న ప్రయాణాన్ని యువ హీరోలకు మార్గదర్శకంగా చెప్పొచ్చు.
