Begin typing your search above and press return to search.

ఫ్రాంఛైజీ స్టార్ బ‌య‌ట‌ప‌డేదెలా?

వ‌రుసగా సీక్వెల్ సినిమాల్లో న‌టిస్తే, అత‌డిని ఫ్రాంఛైజీ స్టార్ అని ముద్ర వేయ‌డం స‌హ‌జం. ఇటీవ‌లి కాలంలో భూల్ భుల‌యా 2, భూల్ బుల‌యా 3 వంటి సినిమాల‌లో న‌టించాడు కార్తీక్ ఆర్య‌న్.

By:  Sivaji Kontham   |   1 Jan 2026 8:00 PM IST
ఫ్రాంఛైజీ స్టార్ బ‌య‌ట‌ప‌డేదెలా?
X

వ‌రుసగా సీక్వెల్ సినిమాల్లో న‌టిస్తే, అత‌డిని ఫ్రాంఛైజీ స్టార్ అని ముద్ర వేయ‌డం స‌హ‌జం. ఇటీవ‌లి కాలంలో భూల్ భుల‌యా 2, భూల్ బుల‌యా 3 వంటి సినిమాల‌లో న‌టించాడు కార్తీక్ ఆర్య‌న్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ విజ‌యాలు సాధించాయి. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో అద్భుత‌మైన వినోదం అందించిన చిత్రాల‌లో కార్తీక్ న‌టించ‌డంతో పెద్ద స్థాయి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత విడుద‌లైన ఏ సినిమాతోను అత‌డు మ‌ళ్లీ బెంచ్ మార్క్ వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయాడు.

దీంతో కార్తీక్ ఆర్య‌న్ ని ఫ్రాంఛైజీ స్టార్ అంటూ కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌గా మారింది. అత‌డు న‌టించిన వ‌రుస నాన్ ఫ్రాంఛైజీ సినిమాలు ఆశించిన విజ‌యాల్ని సాధించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఇటీవ‌ల అత‌డు ల‌వ్ ఆజ్ క‌ల్, చందు చాంపియ‌న్, అల వైకుంఠ‌పుర‌ములో రీమేక్ `షెహ‌జాదా` చిత్రాల‌తో ప్ర‌యోగాలు చేసినా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన వ‌సూళ్ల‌ను సాధించ‌లేదు. చందు చాంపియ‌న్ కోసం అత‌డి మేకోవ‌ర్, న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన‌ వ‌సూళ్లు ద‌క్క‌లేదు. స‌త్య ప్రేమ్ కి క‌థ న‌టుడిగా పేరు తెచ్చినా అంతంత మాత్రంగానే ఆడింది. 'భూల్ భుల‌యా' ఫ్రాంఛైజీ చిత్రాలు సాధించినంత భారీ వ‌సూళ్ల‌ను ఇత‌ర సినిమాలు ఇవ్వ‌లేక‌పోవ‌డం తాజా చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

ఇటీవ‌ల 'తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇది బాక్సాపీస్ వ‌ద్ద దురంధ‌ర్ పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌లేక‌పోయింది. మొదటి వారాంతంలోనే పూర్తిగా చ‌తికిల‌బ‌డింది. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత కార్తీక్ హిట్టిస్తాడ‌నుకుంటే రాంగ్ టైమింగ్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భూల్ భుల‌యా త‌ర‌హా ఫ్రాంఛైజీల‌ మ‌ద్ధ‌తుతోనే అత‌డు నిల‌బ‌డగ‌ల‌డు. అలా సీక్వెల్ సినిమాల్లో న‌టించ‌కుండా, అత‌డు సోలో విజ‌యంతో నిరూపించాల‌ని కొంద‌రు స‌వాల్ విసురుతున్నారు. అయితే అత‌డు ఇప్పుడు దురంధ‌ర్ కంటే ముందు ర‌ణ్ వీర్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో అలాంటి స్థితినే ఎదుర్కొంటున్నాడు. ఒకే ఒక్క దురంధ‌ర్ లాంటి హిట్టు అందుకుంటేనే కానీ కార్తీక్ ఆర్య‌న్ ఈ ద‌శ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేడేమో!

నేటి జెన్ జెడ్ స్టార్ల‌లో విక్కీ కౌశ‌ల్, కార్తీక్ ఆర్య‌న్, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్లు చాలా హార్డ్ వ‌ర్క్ తో ఒక్కో మెట్టు నిర్మించుకున్నారు. ఆ ముగ్గురికీ న‌ట‌వార‌సుల‌కు కూడా లేని క్రేజ్ ఉంది. విక్కీ ఓ ఫైట్ మాస్ట‌ర్ కుమారుడు.. కానీ కార్తీక్, ఆయుష్మాన్ పూర్తిగా ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేకుండా వ‌చ్చిన ఔట్ సైడ‌ర్స్. అయినా ఆ ఇద్ద‌రూ కెరీర్ ని మ‌లుచుకున్న తీరు ఎప్పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఖాన్ లు, కపూర్ లు ఏల్తున్న ప‌రిశ్ర‌మ‌లో ఆ ఇద్ద‌రూ ఎదిగిన తీరు ఎప్ప‌టికీ ఆశ్చ‌ర్యక‌రం.