ముంబై రియల్ ఎస్టేట్‌లో స్టార్ హీరో 2 కోట్ల పెట్టుబడి
ముంబై ఔటర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు నిరంతరం హెడ్ లైన్స్ లో కొస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 4 Sept 2025 10:21 AM ISTముంబై ఔటర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు నిరంతరం హెడ్ లైన్స్ లో కొస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం బాలీవుడ్ సెలబ్రిటీల అధిక సంపాదన. వారంతా తమ ఆర్జనను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెడుతున్నారు. దొరికిన భూములన్నీ ఎడా పెడా కొనేస్తున్నారు. ముంబైలోని ప్రైమ్ ఏరియాలు సహా ఎదుగుదలకు ఆస్కారం ఉన్న అన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు కొని రీసేల్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు.
ముంబై రియల్ ఎస్టేట్ లో భారీగా ఆర్జిస్తున్న స్టార్లలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, వివేక్ ఒబెరాయ్ సహా కథానాయికల్లో కృతి సనోన్, సోనాక్షి సిన్హా, జాన్వీ కపూర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్, ఆయన వారసులు ఆర్యన్, సుహానా కూడా ముంబై ఔటర్ లో భారీగా భూములు కొనడం ఇటీవల చర్చగా మారింది. అయితే సుహానా ఖాన్ ఇటీవల న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అలీభాగ్ లోని రిజిస్ట్రేషన్ కు ఆస్కారం లేని ఒక వ్యవసాయ భూమిపై దాదాపు 13 కోట్ల పెట్టుబడిని పెట్టారు. ప్రస్తుతం ఇది కోర్టు వివాదంలో ఉంది.
గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ అలీబాగ్‌లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. ఇదే చోట కృతి సనన్ సోల్ డి అలీబాగ్ ప్రాజెక్ట్‌లో 2,000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది. దీనితో అలీబాగ్ బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న రెండవ హోమ్ డెస్టినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రాంతంలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశమైంది.
ముంబై - అలీబాగ్‌లో రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేశాడు. ఇది ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) సంస్థ డెవలప్ చేస్తున్న ప్రధాన తీరప్రాంత భూమి. ముంబైకి దగ్గరగా ఉన్న అలీభాగ్ లో తన సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నట్టు కార్తీక్ ధృవీకరించారు. మొదటిసారి భూమిపై పెట్టుబడి పెట్టాను. లోధా కంపెనీపై పూర్తి నమ్మకంతో ఉన్నానని అతడు అన్నాడు.
కార్తీక్ ఆర్యన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే, అతడు వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అనురాగ్ బసు `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ`లో తదుపరి కనిపిస్తాడు, అనన్య పాండే ఇందులో కథానాయిక. 2026లో వాలెంటైన్స్ డే వారాంతంలో విడుదల కానుంది. నాగ్‌జిల్లా అనే ప్రయోగాత్మక చిత్రంలోను కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. శ్రీలీలతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలోను నటిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
