భారతీయ సనాతన ధర్మం రచ్చ గెలిపిస్తుంది: ఎన్బీకే
ఇటీవల విడుదలైన `మిరాయ్` ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఇది అశోక చక్రవర్తి వదిలిపెట్టిన తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించడానికి ఉద్దేశించిన యువ యోధుడు వేదకు సంబంధించిన కథ.
By: Sivaji Kontham | 19 Nov 2025 9:42 AM ISTఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ రచ్చ గెలిచి ఇంట గెలుస్తోంది తెలుగు సినిమా. భారతీయ చిత్రసీమ అంటే ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే అనుకునే స్థితి నుంచి ఇప్పుడు ''భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా'' అనే రేంజుకు ఎదిగింది. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడి వరకూ ఒక ఎత్తుగడ అనుకుంటే, పాన్ ఇండియాకు సనాతన ధర్మం ఆచారాలను శక్తిని పరిచయం చేస్తూ హైందవంపై తీసిన సినిమాలు మరొక ఎత్తుగడ. ఇవన్నీ ఉత్తరాది బెల్ట్ లో అద్భుత సక్సెస్ ని సాధిస్తున్నాయి.
ఇంతకుముందు నిఖిల్- చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2, ప్రశాంత వర్మ- హనుమాన్, కార్తీక్ ఘట్టమనేని- మిరాయ్ లాంటి సినిమాలు ఉత్తరాది మార్కెట్ లో ప్రభావం చూపడం వెనక హైందవ ధర్మం అంతర్లీనంగా బలమైన ఇతివృత్తంగా కనిపించడం ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తికేయ 2 లో సనాతన ధర్మానికి పునాది వేసిన గీతోపదేశకుడు లార్డ్ శ్రీకృష్ణ గురించి, నీట మునిగిన ద్వారకా నగరం గురించి చందు మొండేటి అద్భుత విజువల్స్ ని ఆవిష్కరించారు. సనాతన ధర్మంలోని కర్మ ప్రిన్సిపల్ ని అద్భుతంగా లీడ్ చేస్తుంది ఈ చిత్రం. అందుకే ఇది ఉత్తరాది ఆడియెన్ ని కూడా స్పెల్ బౌండ్ చేసింది. ఆ తర్వాత హను-మాన్ చిత్రంలోను అంతర్లీనంగా దైవశక్తి సూపర్ పవర్స్ ని ఎలివేట్ చేసిన ప్రశాంత్ వర్మ అద్భుత ప్రశంసలు అందుకున్నారు. శ్రీరాముని భక్తుడు అద్భుత బలశాలి, వాయుపుత్రుడు అయిన ఆంజనేయుని శక్తిని పొంది శత్రువుల భరతం పట్టేవాడిగా తేజ సజ్జాను అద్భుతంగా చూపించారు ఈ చిత్రంలో.
ఇటీవల విడుదలైన `మిరాయ్` ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఇది అశోక చక్రవర్తి వదిలిపెట్టిన తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించడానికి ఉద్దేశించిన యువ యోధుడు వేదకు సంబంధించిన కథ. బ్లాక్ నైఫ్ అనే చీకటి మాంత్రికుడు మహాబీర్ లామాతో పోరాడే యువకుడి కథ ఇది. దీనిని యువదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీర్చిదిద్దిన తీరు, అంతర్లీనంగా సనాతనాన్ని ప్రవేశపెట్టిన తీరు ప్రతిదీ ఆకట్టుకున్నాయి. అంతర్లీనంగా పవిత్ర గ్రంథాలతో ముడివేసి సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కూడా బహుశా ఉత్తరాది ఆడియెన్ కి కనెక్ట్ కావడానికి కారణం కావొచ్చు.
పాన్ ఇండియా వసూళ్లకు ఇలాంటి ఒక మంచి పాయింట్ కనెక్టయితే చాలని ఇవన్నీ ప్రూవ్ చేసాయి. అందుకే ఇప్పుడు సనాతన ధర్మం బేస్ చేసుకుని వస్తున్న బాలకృష్ణ అఖండ 2 పైనా భారీ అంచనాలేర్పడ్డాయి. సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని మరోసారి తెరపై చూస్తారంటూ నిన్నటి రోజున విశాఖలో జరిగిన ప్రత్యేక పాట లాంచింగ్ వేడుకలో ఎన్బీకే అన్నారు. శివుడి ఆజ్జ లేనిదే చీమ కూడా కుట్టదంటారు.. ఎవరి ఆజ్ఞ పని చేసిందో మీరు రేపు తెరపై చూస్తారు. అఖండ మొదటి భాగం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడు రెండో భాగం ఇంటా బయటా కూడా అందరినీ మెప్పిస్తుందని ఎన్బీకే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
ఇది కేవలం తెలుగు సినిమా కాదు.. ఇది మన భారతీయ సనాతన హైందవ ధర్మం.. ఒక శక్తి.. దాని గౌరవం.. పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు. మన సనాతన హైందవ ధర్మం అనేది మన జాతి మూలాలకు సంబంధించినది. సత్యం కోసం నిలబడండి. ధర్మంగా జీవితాంతం పోరాడండి.. తల వొంచకండి.. అని సనాతనం చెబుతుంది... అని బాలయ్య అన్నారు. అఖండ తీసి ఇంట గెలిచాం.. పాన్ ఇండియాలో అఖండ 2 నిరూపిస్తుందని ఎన్బీకే ధీమాను కనబరిచారు. అఖండ 2 ముంబై ప్రచారం పెద్ద సక్సెసైందని కూడా బాలయ్య విశాఖ వేడుకలో గుర్తు చేసారు. ``ముందు మన దెబ్బేంటో బాంబోలో హిందీ వాళ్లకు చూపించాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పుడు రచ్చ గెలిచి ఇక్కడికి వచ్చాం. ముంబైలో రచ్చ రచ్చ చేసాం. తాండవం పాటను అక్కడి వాళ్లు బాగా ఆస్వాధించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖ పట్నంలో మిమ్మల్ని కలుస్తున్నా``మని బాలయ్య అన్నారు.
బలమైన నమ్మకం...
బాలకృష్ణ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ అఖండ 2: తాండవం డిసెంబర్ 5న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. గత వారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మాతలు టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇప్పుడు రెండవ పాట జాజికాయ జాజికాయను వైజాగ్‌లోని ఒక ప్రముఖ థియేటర్‌లో విడుదల చేశారు.
`అఖండ 2` కేవలం తెలుగు సినిమా కాదు. అఖండ 2 మంచి సినిమా అని, ఇది పాన్-ఇండియా సంచలనం అవుతుందని బాలకృష్ణ విశ్వసిస్తున్నారు. దైవిక అంశాలతో నిండిన ఈ యాక్షన్ డ్రామా హిందీ బెల్ట్‌లో ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు.
