భర్తతో చైతూ హీరోయిన్ ఓనం పండుగ.. హైలెట్గా నిలిచిన ఫ్యామిలీ ఫొటోస్!
అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 7 Sept 2025 12:30 PM ISTఒకటి, రెండు చిత్రాలతోనే ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ అప్పుడప్పుడు దర్శనమిస్తే మాత్రం అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, సడన్ గా ఇండస్ట్రీకి దూరమైన ఒక హీరోయిన్ తాజాగా తన కుటుంబంతో కలిసి ఓనం సెలబ్రేషన్స్ జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ అభిమాన హీరోయిన్ ను చాలాకాలం తర్వాత చూసేసరికి.. అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అంతేకాదు ఆమె షేర్ చేసిన ఫోటోలకు లైక్, షేర్ చేయడమే కాకుండా కామెంట్లు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధా కూతురు కార్తీక నాయర్.. నాగచైతన్య హీరోగా నటించిన 'జోష్' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత జీవ హీరోగా నటించిన 'రంగం' సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాని మొదట తమిళంలో తీసి, ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశారు. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ... అలా 2023 నవంబర్ 19న రోహిత్ మేనన్ తో తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్లో వివాహం చేసుకుంది.
వివాహమనంతరం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తాజాగా ఓనం సెలబ్రేషన్స్ జరుపుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఒకవైపు ఓనం సెలబ్రేషన్స్ తో పాటు మరొకవైపు వినాయక చతుర్థి వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు. ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ కుటుంబంతో కలిసి జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా భర్తతో ఓనం జరుపుకున్న ఫోటోలను షేర్ చేయడంతో ఈ జంటని చూసి క్యూట్ జోడి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కార్తీక నాయర్ తొలినాళ్ల జీవితం విషయానికి వస్తే.. ఈమె తల్లి ప్రముఖ నటి రాధ, ఈమె పెద్దమ్మ అంబిక.. ఈమె కూడా దక్షిణ భారత నటే కావడం గమనార్హం. కార్తీకకి ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. అటు ఈమె చెల్లెలు తులసి నాయర్ కూడా ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కార్తిక ముంబైలోని పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. 17వ ఏటనే తెలుగు సినిమా జోష్ ద్వారా అరంగేట్రం చేసింది.
తెలుగులో దమ్ము , బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాలలో చేసిన ఈమె.. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. మరో 2 తమిళ్ చిత్రాలలో చివరిగా నటించింది. అలా 2015లో ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. మళ్లీ తెరపై కనిపించలేదు. కానీ 2017లో హిందీ సీరియల్ ఆరంభ్ లో నటించింది.
