Begin typing your search above and press return to search.

1000 కోట్ల డిబేట్‌పై సుబ్బరాజ్ చమత్కారం!

ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల జోరు కొన‌సాగుతోంది. దీంతో 1000 కోట్ల బాక్సాఫీస్ మార్క్‌ను అందుకోవడం అగ్ర‌ హీరోలకు సాధారణ మైలురాయిగా మారిపోయింది.

By:  Srikanth Kontham   |   30 Oct 2026 6:31 PM IST
1000 కోట్ల డిబేట్‌పై  సుబ్బరాజ్ చమత్కారం!
X

ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల జోరు కొన‌సాగుతోంది. దీంతో 1000 కోట్ల బాక్సాఫీస్ మార్క్‌ను అందుకోవడం అగ్ర‌ హీరోలకు సాధారణ మైలురాయిగా మారిపోయింది. కన్నడలో `కె.జి.ఎఫ్`..తెలుగులో `పుష్ప` వంటి చిత్రాలు భారీ మార్క్‌ను దాటి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయితే తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం ఇప్పటివరకు ఆ స్థాయిలో ఒక్క విజ‌యం కూడా అందుకోలేదు. 700 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు సాధించాయి త‌ప్ప అంత‌కు మంచి బోర్డ‌ర్ దాట‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఇటీవల జరిగిన ఓ ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లో విద్యార్థులు - ప్రేక్షకులతో ముచ్చటించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య లాంటి దిగ్గజ నటులు, అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఉన్న కోలీవుడ్ నుంచి ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్ల సినిమా ఎందుకు రాలేదని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. దీనిపై మొదట సరదాగా నవ్వుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఆ తర్వాత బాక్సాఫీస్ లెక్కలు ..సినిమాల విజయాల వెనుక ఉండే అసలు రహస్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఎవరైనా సరే ముందుగానే ప్లాన్ చేసుకుని 1000 కోట్ల సినిమాను తీయలేరని కార్తీక్ అన్నారు. `మొదట తెలుగు ఇండస్ట్రీ ఆ మార్క్‌ను ఎలా సాధించిందో మీరే నాకు చెప్పండి? ఆ తర్వాత నేను కారణం చెబుతాను` అంటూ చమత్కరించారు. సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదని.. అది అద్భుతమైన కళ అని అభిప్రాయపడ్డారు. ఎవరైనా సరే నేను కచ్చితంగా వెయ్యి కోట్ల సినిమానే తీస్తాను అని ముందుగానే టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగితే ఆ మ్యాజిక్ ఎప్పుడూ వర్కౌట్ కాదన్నారు.

కన్నడలో `కె.జి.ఎఫ్` లేదా తెలుగులో `పుష్ప` చిత్రాల నిర్మాణ సమయంలో ఆ చిత్రాల దర్శకులు లేదా నిర్మాతలు అంత పెద్ద మొత్తాన్ని టార్గెట్ చేసి ఉండరని కార్తీక్ అభిప్రాయపడ్డారు. కేవలం సినిమాపై ఉన్న నమ్మకంతో ఒక మంచి కథను తెరకెక్కించగా అది దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చడంతో ఆటోమేటిక్‌గా ఆ అద్భుతం జరిగి పోయిందని విశ్లేషించారు. అలాంటి మ్యాజిక్‌లను మనం ప్లాన్ చేసి సృష్టించలేమని.. అది వాటంతట అవే జరుగుతాయని కార్తీక్ పేర్కొన్నారు.

రజనీకాంత్ నటించిన `జైలర్` ..`2.0` వంటి చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించినా? ఇప్పటికీ 1000 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించడంలో తమిళ పరిశ్రమ వెనుకబడిందనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. నంబర్ల కోసం పరుగులు పెట్టడం కంటే కథా బ‌ల‌మున్న‌ చిత్రాలను అందిం చడమే ముఖ్యమని సుబ్బ‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్లు అనేది ప్లాన్ చేస్తే వ‌చ్చేది కాద‌ని ..అది ప్రేక్షకాభిమానులు సృష్టించే ఓ మ్యాజిక్ అని చెప్ప డం ద్వారా సుబ్బరాజ్ డిబేట్‌కు సరికొత్త అర్ధాన్నిచ్చిన‌ట్లు అయింది. త‌మిళ ద‌ర్శ‌కులు నెంబ‌ర్ గేమ్ కంటే? కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలనే అభిప్రాయం ప‌రిశ్ర‌మ స‌హా ప్రేక్ష‌కుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.