గ్లోబల్ వేదికపై సౌత్ సినిమా ఘనత!
గత పదేళ్ల కాలంలో టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన మొదటి తమిళ చిత్రంగా `డోరోతీ` నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
By: Srikanth Kontham | 13 Sept 2026 5:00 AM ISTతమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం `డోరోతీ` అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కెనడాలో ఘనంగా జరుగుతోన్న టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శనను శనివారం నిర్వహించారు. గత పదేళ్ల కాలంలో టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన మొదటి తమిళ చిత్రంగా `డోరోతీ` నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
టోరంటోలోని స్కోటియాబ్యాంక్ థియేటర్‌లో నిర్వహించిన ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. ప్రదర్శన ముగిసిన అనంతరం ఆడిటోరియంలో అభిమానులు, అంతర్జాతీయ ప్రతినిధులు లేచి నిలబడి చప్పట్లతో చిత్రబృందాన్ని అభినందించారు. ఈ వేడుకలో హీరోయిన్ కీర్తి సురేష్, నటులు సనాంత్, రిషికాంత్ లతో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత, నిర్మాత గునీత్ మోంగా కపూర్, ప్రొడ్యూసర్ అచిన్ జైన్ పాల్గొని సందడి చేశారు.
సమాజంలో వేళ్లూనుకున్న కులం, పురుషాధిక్యత, గుర్తింపు , మానవీయ అనుబంధాల నేపథ్యంలో విభిన్నమైన కథాంశంతో కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని మలిచారు. తమిళనాడు గ్రామీణ నేపథ్యం, అక్కడి సంస్కృతిలో సాగే కథ అయినప్పటికీ ఇందులో చూపించిన భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని కార్తీక్ అన్నారు . స్నేహం, నిశ్శబ్దంగా మిగిలిపోయే ప్రేమ, కఠినమైన పరిస్థితుల్లోనూ కనిపించే ఆర్ద్రతను హృదయానికి హత్తుకునేలా సినిమాలో ఆవిష్కరించారు.
ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ సంగీత దిగ్గజం ఇళయరాజా అందించిన స్వరాలు. సంగీత దర్శకుడిగా ఇది ఆయనకు 1540వ సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్ - సిఖ్య ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం, దర్శకుడి కథా కథనం సినిమాకు ప్రాణంగా నిలిచాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా జియో స్టూడియోస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే స్పందించారు.`డోరోతీ` సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని, టీజర్ ద్వారానే భావోద్వేగాల లోతును ప్రేక్షకులు గుర్తించారని కొనియాడారు. అలాగే ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ కాంబినేషన్‌లో సినిమాను ప్రపంచ వేదికపై ప్రదర్శించడం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ శ్రమ, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరల్డ్ ప్రీమియర్ లో లభించిన విశేష ఆదరణతో చిత్రబృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే నిలబడి ప్రశంసలు అందుకున్న చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
