సున్నితమైన అంశాలతో ప్రయోగాలా? క్లైమాక్స్‌పై విమర్శల తుఫాను!
విలక్షణమైన కథాంశాలు, వినూత్నమైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు.
By: Srikanth Kontham | 26 Sept 2026 10:21 AM ISTవిలక్షణమైన కథాంశాలు, వినూత్నమైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన `డొరొతీ` ఎపిసోడ్‌లో చూపించిన కథాంశం , క్లైమాక్స్ పెను వివాదానికి దారితీసింది. కథ ముగింపులో ఇచ్చిన LGBTQ+ ట్విస్ట్ వీక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున వ్యతిరేకతకు కారణమైంది. సాదాసీదాగా సాగుతున్న కథనంలో చివరి నిమిషంలో డొరొతీ పాత్రకు సంబంధించి రివీల్ చేసిన LGBTQ+ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ మొదలైన) కోణం ప్రేక్షకులకు రుచించలేదు.
కథా గమనానికి ఎలాంటి సంబంధం లేకుండా షాక్ వాల్యూ కోసం.. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుస రించడం కోసమే ఈ అంశాన్ని బలవంతంగా కథలో జొప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కథనంలో సహజత్వం లోపించిందని క్లైమాక్స్ తిప్పడం కోసమే ఇలాంటి ప్రయోగాలు చేశారంటూ నెటిజన్లు, విమర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. LGBTQ+ వర్గానికి చెందిన సున్నితమైన భావోద్వేగాలను, వారి జీవితాలను సరైన ప్రాతినిధ్యంతో, గౌరవప్రదంగా చూపించకుండా నాటకీయత కోసమే వాడుకున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.
ఇలాంటి సున్నితమైన విషయాలను కథలో చేర్చేటప్పుడు మరింత బాధ్యతా యుతంగా, పరిణతి చెందిన దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందని అభిప్రా యపడుతున్నారు. ప్రచారం కోసం ఇలాంటి కాన్సెప్టులను వాడుకోవడం ఆ వర్గాన్ని అవమానించడమే అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువె త్తుతున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో LGBTQ+ ఇతివృత్తాలతో కూడిన కథలు పెరిగినా? వాటిని ప్రేక్షకులు ఆమోదించే రీతిలో సరిగ్గా మలచడం అత్యంత కీలకమైన అంశంగా మారింది.
కథలోని సారాంశానికి తగినట్లుగా కాకుండా ప్రచారం కోసమో లేదా ఊహించని మలుపు కోసమో ఈ అంశాలను జోడిస్తే అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. సంక్లిష్టమైన సామాజిక విషయాలపై స్పష్టమైన అవగాహనతో సినిమాలు తీయాలని ప్రేక్షకులు సూచిస్తున్నారు. అయితే ఈ వివాదంపై కార్తీక్ సుబ్బరాజ్ ఇంకా స్పందించలేదు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ తాజా వివాదం నేపథ్యంలో రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
