సినిమా చూసి మారుతున్న పురుషుల మనసులు!
సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఆన్‌లైన్ నిరసనలు, బాయ్‌కాట్ పిలుపులు వెల్లువెత్తాయి.
By: Srikanth Kontham | 4 Oct 2026 5:00 PM ISTతమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా చిత్రం `డోరతీ` సోషల్ మీడియాలో చర్చనీ యాంశంగా మారింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకవైపు విమర్శకుల ప్రశంసలు అందుకుం టుండగా..మరోవైపు కథాంశం కారణంగా విభిన్న వివాదాల నడుమ వార్తల్లో నిలిచింది. ట్రాన్స్‌జెండర్లు, ఎల్‌జీబీటీక్యూ అంశాల నేపథ్యంతో కూడిన కథాంశం సమాజంలో పలు ఆలోచనా విధానాలను ప్రతిబింబిస్తోంది.
సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఆన్‌లైన్ నిరసనలు, బాయ్‌కాట్ పిలుపులు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా సమానలింగ ప్రేమ ,క్వీర్ అంశాలను సినిమాలో చూపించడంపై కొంతమంది నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సినిమా విడుదలకంటే ముందే లీకైన ఒక సన్నివేశం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఆన్‌లైన్‌లో హోమోఫోబియా, ట్రాన్స్‌ఫోబియా రూపంలో తీవ్ర విమర్శలు వ్యక్తమైనా? చిత్రబృందం ధైర్యంగా తమ కథను సమర్థించుకుంది.
తాజాగా ఆన్‌లైన్ నెగెటివిటీ .. బాయ్‌కాట్ డిమాండ్లపై కార్తీక్ సుబ్బరాజ్ స్పందించారు. నెగెటివ్ విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు, ట్రోలింగ్ కంటే సినిమా అందించే సానుకూల సందేశం , ప్రేక్షకుల స్పందనపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. సమాజంలో ఈ సినిమా తీసుకొచ్చే మానసిక మార్పే తమకు అత్యంత ముఖ్యమైన విజయమని నొక్కి చెప్పారు.
ఈ చిత్రం ద్వారా ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజం వైఖరి మారాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో వారిని గౌరవప్రదంగా చూడాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ట్రాన్స్‌జెండర్ల పాత్రలను హాస్యానికి లేదా మూసధోరణికి పరిమితం చేశారని ఆ పరిస్థితి క్రమంగా మారుతోందని, వారి నిజ జీవిత పోరాటాలను, వాస్తవాలను తెరపై గౌరవప్రదంగా ఆవిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారని, ముఖ్యంగా కొందరు పురుషులు గతంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల ప్రవర్తించిన తీరును తలచుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేశారని కార్తీక్ వెల్లడించారు. ఈ చిత్రం సమాజంలోని చేదు నిజాలను.. తరచూ గుర్తించడంలో విఫలమవుతున్న వాస్తవాలను కళ్లకు కట్టే అద్దంలా నిలిచిందని కొంతమందిలోనైనా ఆత్మ పరిశీలన కలిగించడమే తమకు దక్కిన అతిపెద్ద విజయం అని పేర్కొ న్నారు.
1980ల కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు సనంద్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించారు. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ , జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన చిత్రం అక్టోబర్ 2న తెలుగులో కూడా విడుదలైంది.
